
- బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సవాల్
- బండి సంజయ్ పుట్టుకతో ఓబీసీ.. కానీ మోదీ కాదు
- కులగణనపై కేంద్రం వైఖరేంటో చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ కులమేంటి? అని అడుగుతున్న బీజేపీ నేతలు.. దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, అప్పుడు రాహుల్ ఇంటికి వెళ్లి ఆయన కులం వివరాలు అడగాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్విసిరారు. ‘‘కేంద్రంలోని బీజేపీ సర్కార్ కులగణన చేపడితే, రాహుల్ స్వయంగా అందులో పాల్గొంటారు. అప్పుడు తన కులమేంటో చెప్పి, ఆ ఫామ్ పై సంతకం చేస్తారు. రాహుల్ కులమేంటో దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేకించి బీజేపీ నేతలకు చెప్పాల్సినఅవసరం లేదు” అని అన్నారు. కులగణనపై కేంద్రం వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల మీద బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. జనగణనతో పాటు కులగణన చేయాలని డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్ లో మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడారు. ‘‘బండి సంజయ్ పుట్టుకతోనే ఓబీసీ. కానీ ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు. మోదీ కులాన్ని 1994లో ఓబీసీలో చేర్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీన్ని అంగీకరించారు” అని ఆయన చెప్పారు.
దేశం కోసం బీజేపీ చేసిన త్యాగమేంటి?
పదేండ్లలో ఓబీసీ ప్రధాని మోదీ దేశంలోని బీసీలకు చేసిందేమీ లేదని మహేశ్ గౌడ్ విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. బండి సంజయ్ లాంటి బీసీ నేతను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి బీజేపీ ఎంపీ బట్టెబాజ్ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. దేశం కోసం బీజేపీ నేతలు చేసిన త్యాగం ఏమిటని ప్రశ్నించారు. సోనియాగాంధీ ఇటలీలో పుట్టినా, భారతీయతను పుణికిపుచ్చుకున్నారని తెలిపారు. ‘‘మోదీ కులం గురించి సీఎం రేవంత్ రెడ్డి తప్పేమీ మాట్లాడలేదు. రేవంత్ మాటలకు బీజేపీ నేతలు ఎందుకు హైరానా పడుతున్నారు. మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ అంటే.. దీనిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారు” అని మండిపడ్డారు. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లకు చట్టం తీసుకొస్తామన్నారు. దాన్ని కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు.
పింక్ బుక్ ఓపెన్ చేస్తే.. వెలుగులోకి మరిన్ని స్కామ్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన పింక్ బుక్ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ‘‘ఇప్పటికే ఢిల్లీ స్కామ్ బయటపడింది. ఇక పింక్ బుక్ ఓపెన్ చేస్తే, ఇంకెన్ని స్కామ్స్ బయటపడతాయో. అందుకే కవిత పింక్ బుక్ ఓపెన్ చేయకుండా ఉండడమే మేలు” అని ఎద్దేవా చేశారు.