కేటీఆర్‌.. తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగమేంటో చెప్పు: టీపీసీసీ చీఫ్

  • రాష్ట్రంలో కాంగ్రెస్‌ మార్క్‌
  • ప్రజాపాలన పండగలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: టీపీసీసీ చీఫ్

హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్‌ మార్క్‌ పాలన కనిపిస్తోందని, ప్రజాపాలన పండగలో ప్రజలంతా భాగస్వాములు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో 50వేల ఉద్యోగాలిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే  50వేలకు పైగా కొలువులు ఇచ్చిందని తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘మా ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు చేసిన దోపిడీ ఇంతా అంతా కాదు. ఒక్కొక్కటిగా బయటకు తీస్తం. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్‌ పగటికలలు కంటున్నరు. దొరల పాలన వద్దనే ప్రజలు కాంగ్రెస్​కు పట్టం కట్టారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజల యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతికి అద్దంపట్టే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్‌ అంటున్నరు. రాజీవ్‌ చేసిన సేవల గురించి కేటీఆర్‌కు తెలియదా? దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగం ఏమిటో చెప్పాలి? పదేండ్ల పాటు తెలంగాణ సంపద దోచుకున్న కుటుంబం.. కేసీఆర్‌ కుటుంబం. భూములు, నిధులు, నియామకాల పేరుతో అడ్డంగా దోచుకున్నారు. ఈనెల 9న సోనియాగాంధీ పుట్టిరోజు సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహిస్తం’ అని తెలిపారు.