మంత్రి నిరంజన్ రెడ్డి నీళ్ల నిరంజన్ కాదు.. కమీషన్ల నిరంజన్ అని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉద్యమ టైమ్ లో ఏమీ లేదని చెప్పిన నిరంజన్ కు వందల ఎకరాలు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ వేల ఎకరాల్లో ఫామ్ హౌజ్ లు కట్టుకుంటుంటే... మంత్రి నిరంజన్ రెడ్డి వందల ఎకరాల్లో ఫామ్ హౌజ్ లు కట్టుకుంటున్నారని చెప్పారు. నిరంజన్ రెడ్డి వందల ఎకరాల భూములను కబ్జా పెట్టాడని ఆరోపించారు. గుడి, బడి తేడా లేకుండా భూములన్నీ నిరంజన్ రెడ్డి మింగేశారని చెప్పారు. వనపర్తిలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ రాక ముందు.. వచ్చాక కూడా పాలమూరు జిల్లా అభివృద్ధిలో వెనుకబడే ఉందన్నారు రేవంత్ రెడ్డి. వనరులు ఉన్నా.. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలన్న ఆలోచన చేయకపోవడం వల్ల వెనుకబాటుకు గురైందన్నారు. రాష్ట్రానికి పాలమూరు బిడ్డ నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లా వలసల జిల్లాగా కాకుండా అభివృద్ధికి నమూనగా రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దే అవకాశం ఈ జిల్లా బిడ్డలు తీసుకోవాలని కోరారు.
గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే నిధులు కేటాయించారని చెప్పారు. కేసీఆర్ సొంతూరు చింతమడకలో గుడి, బడి, రోడ్డు వేసింది అనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని అన్నారు. 9 ఏళ్లలో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. తెలంగాణ వచ్చాక 4 కోట్ల ప్రజల కలలు నెరవేరాయా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల ఇండ్లల్లో మాత్రమే కనకవర్షం కురిసింది.. కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం మాత్రం కుప్పకూలింది అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు.
కేసీఆర్ కు మూడోసారి అధికారం ఇస్తే ఆయన మనవడికి కూడా మంత్రి పదవి ఇస్తాడంటూ సెటైర్ వేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఏపీలో పార్టీ నష్టపోయినా.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అని కోరారు. పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు దండుపాళ్యం ముఠా మాదిరిగా దోచుకున్నారని, ఈ సారి అవకాశం ఇస్తే ప్రజల ప్రాణాలే కాదు.. కిడ్నాలను కూడా అమ్ముకుని.. బలిపశువులను చేస్తారని ఆరోపించారు.
వ్యవసాయ మంత్రికి వ్యవసాయం గురించి తెలుసో తెలియదో తనకు మాత్రం తెలియదన్నారు. లాల్చీ వేసుకున్న వారు లాల్ బహదూర్ శాస్త్రి కాదు.. పంచె కట్టుకున్న వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదు అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా అనుకుంటున్నాడని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు నిరంజన్ రెడ్డి తీరు ఉందన్నారు. రైతులను పొట్టనపెట్టుకున్న నరహంతక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జి. చిన్నారెడ్డి తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యారంగంలో వనపర్తిని అనాడు నెహ్రూ ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. వనపర్తికి తెలంగాణ సాధనలో ప్రత్యేక స్థానం ఉందన్నారు.