రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ను బలహీన పర్చడం ద్వారా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ కు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గెలవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహమే కారణమన్నారు. విపక్షాలను బలహీన పర్చే విధంగా మమతా బెనర్జీ గెలవడానికి బీజేపీకి ప్రతిపక్ష హోదా రావడానికి ఇద్దరి మధ్య చక్రం తిప్పింది పీకేనే అన్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్, మోడీల మధ్య పీకే ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ రద్దయితే పీడ విరగడవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు కూడా మోడీకి అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని.. విభేదాలు మాత్రం లేవన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ రద్దయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.