అధికారంలో రాగానే ఆరు గ్యారెంటీల పైనే తొలి సంతకం : రేవంత్ రెడ్డి

సోనియాగాంధీ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలను ప్రకటించిన తర్వాత రోజు నుంచి కేసీఆర్ కనిపించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలను చూసిన కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ఒక్కటేనని అన్నారు. ప్రధాని చెప్పింది అబద్ధమైతే ప్రధాని చెప్పింది అబద్ధమైతే కేసీఆర్ ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. 

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీఓట్లన్నీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బదిలీ అయ్యాయని, దీంతో 105 చోట్ల బీజేపీ డిపాజిట్లు కోల్పోయిందని చెప్పారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆ ఓటు బీజేపీకి డైవర్ట్ అయ్యిందని, ఫలితంగా రాష్ట్రంలో నాలుగు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలిచిందని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం వ్యతిరేక ఓట్లను చీల్చే కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పదే పదే తెలంగాణలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. 

ఈ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణకు పట్టిన పీడా వదిలిపోయే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ లక్ష కోట్లు, 10 వేల ఎకరాలు దోచుకున్నారని ఆరోపించారు. అమరవీరుల స్థూపం, అంబెడ్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు. 

ప్రజాతీర్పు నిర్ణయమైందని, కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందన్నారు. రాష్ట్రంలో నిర్వహించే ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రల్లో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు పాల్గొంటారని చెప్పారు