బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఆ నిధులతో మెఘా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ల కాంట్రాక్టులకు బిల్లలు కట్టారని విమర్శించారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిధుల్లేక కొందరు సర్పంచులు పుస్తెలు అమ్ముకుంటే, మరికొందరు బిచ్చమెత్తుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు అడ్డుకోవడం మానేసి.. ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
సర్పంచులపై పోలీసుల నిఘా ఉందని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు. సర్పంచులు ఆస్తులమ్మి అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారని.. ప్రభుత్వం వెంటనే మళ్లించిన నిధులను వారికి జమ చేయాలని డిమాండ్ చేశారు. నిధులు రాకపోవడంతో ఆత్మహత్య సర్పంచుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చెట్టు సచ్చిపోతే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తామన్న కేసీఆర్.. హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ను సస్పెండ్ చేస్తారా అని రేవంత్ ప్రశ్నించారు.హైదరాబాద్ నగరాన్ని అధ్వానంగా మార్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్ లకే దక్కతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని.. జీతాల కోసం 28వేల కోట్ల అప్పు తెచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని రేవంత్ మండిపడ్డారు.