
- బీఆర్ఎస్ ఓడిపోతే జరిగేది అదే
- బీఆర్ఎస్ దగ్గర నోట్లుంటే.. మా దగ్గర ఓట్లున్నయ్
- ధరణి కన్నా మంచి పోర్టల్ తెస్తం.. భూముల మీద హక్కులిస్తం
- ఆదివాసీలు, లంబాడీలు కాంగ్రెస్ కు రెండు కళ్లు
- ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేస్త
- ఉట్నూరు ఎన్నికల ప్రచార సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఉట్నూరు/ఆదిలాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతే మంత్రి కేటీఆర్, ఆయన బంట్రోతు, ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అమెరికా పారిపోతారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనులపై కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ మరే పార్టీకి లేదన్నారు. ఇవాళ ఉట్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ధరణి రద్దయితే రైతుబంధు రాదని సీఎం కేసీఆర్ అంటున్నారని, సోయి ఉండి మాట్లాడుతున్నారా..? మందేసి మాట్లాడుతున్నారా తనకు అర్థం కావడం లేదన్నారు.
రైతుబంధు పథకం 2018లో ప్రారంభమైందని, ధరణి పోర్టల్ వచ్చింది 2020లో అని చెప్పారు. అదే నిజమైతే రెండేళ్లు రైతుబంధు డబ్బులు ఎలా ఇచ్చారని రేవంత్ ప్రశ్నించారు. ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, రాజీవ్ గాంధీ మొదటిగా కంప్యూటర్ తీసుకొచ్చారని చెప్పారు. భూముల వివరాలను కంప్యూటరీకరించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో మంచి పోర్టల్ తీసుకొస్తామని చెప్పారు.
రైతులెవరికీ నష్టం జరగకుండా చూస్తామని అన్నారు. ‘ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన భూములకు పట్టాలు ఇచ్చి.. అమ్ముకునే సౌకర్యం కల్పిస్తం.. ధరణిని బంగాళాఖాతాలో కలుపుతం. భూముల మీద హక్కులు ఇస్తం.. అటవీ ప్రాంతంలో గిరిజనేతరులకు బ్యాంకుల్లో లోన్లు వచ్చేలా పట్టాలు మార్పిడి చేస్తం. గిరిజనులు, గిరిజనేతరులను కాపాడుకోవడమే ఎడ్మ బొజ్జు విధానం, కాంగ్రెస్ పార్టీ విధానం.
ఆదివాసీలు, లంబాడీలకు ఉన్న పంచాయితీని తెంచుతం. కుడిపక్కన లంబాడీలు, ఎడమ పక్కన ఆదివాసీలను కూర్చోబెట్టుకొని సమస్యను పరిష్కరిస్తం. నాకు లంబాడీలు.. ఆదివాసీలు రెండు కళ్ల మాదిరి.’ అని అన్నారు.
నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెత్తేటోళ్లు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరో, బిర్లా మందిర్ దగ్గరో బిచ్చమెత్తుకునేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నమని చెప్తున్న చంద్రశేఖర్ రావు తన సవాలును స్వీకరించాలని, సబ్ స్టేషన్లకు వెళ్లి లాగ్ బుక్కులు బయటపెడ్దామని అన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చినట్టు చూపిస్తే తాను, తమ పార్టీ అభ్యర్థులు పోటీలోనే ఉండబోమన్నారు.
లేకుంటే సీఎం కేసీఆర్ ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా కరెంటు లేని గ్రామాలున్నాయని, సిగ్గులేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంట
తెలంగాణ ఆవిర్బవించి 9 ఏండ్లు గడిచినా ఆదిలాబాద్ అభివృద్ధి చెందలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ జిల్లాను విస్మరించిందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాను ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానని చెప్పారు. ఈ సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడ్మబొజ్జు, సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ తదితరులు పాల్గొన్నారు.