పాల్వాయి స్రవంతి రక్తం ధారపోసైనా అభివృద్ధి చేస్తది : రేవంత్

‘‘పాల్వాయి స్రవంతికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆమె రక్తం ధారపోసయినా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది’’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ఓటు లేదు.. ఆయనకు ఓటు వేయాలా ? ఆయన ఓటు కూడా ఆయన వేసుకోలేడు. రాజగోపాల్ రెడ్డికి మునుగొడులో ఊరు లేదు... అసెంబ్లీలో నోరు లేదు’’ అని వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని దామెర గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రేవంత్ మాట్లాడారు.  

‘‘ దామెర గ్రామ సర్పంచ్ యాదగిరిని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలి.  ఒక దళిత యువ సర్పంచ్ నమ్మిన జెండా కోసం నిలబడి అమ్ముడుపోకుండా ఉన్నాడు.తాను పేదరికంలో ఉన్నా.. పార్టీ కోసం  నిలబడటం గొప్పవిషయం’’ అని పేర్కొన్నారు. ఇవాళ కాంగ్రెస్ ను చంపాలని తిరుగుతున్న వాళ్లు నాయకులుగా ఎదిగారంటే.. అది కాంగ్రెస్ పార్టీ చలువేనన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని మండిపడ్డారు.

టీఆర్ఎస్, బీజేపీల వల్ల ఇక్కడి సమస్యలు ఎన్నడూ పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవగానే.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుందని  రేవంత్ హామీ ఇచ్చారు.  రాహుల్ గాంధీని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు రూ.5వేల కోట్లు విడుదల చేసేలా చూస్తానని వెల్లడించారు.