హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు కనీసం ఉగాది పండుగ చేసుకోలేని స్థితి నెలకొందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ఏదో ఒక రకంగా బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన పంచాంగ శ్రవణం ముగిసిన తర్వాత మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. ఈ ఉగాది తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏ లక్ష్య సాధనలో భాగంగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారో.. ఆ దిశగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదులో 40 లక్షలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ ముగ్గురు మహిళల సారథ్యంలో ఏర్పడిందని.. ఇప్పుడు తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోవడం బాధాకరమని అన్నారు.
ధరల పెరుగుదలపై ఆగ్రహం
పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెరుగుదల, కరెంట్, బస్సు చార్జీల పెంపుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం యూపీఏ హయాంలో నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండేవని అన్నారు. కానీ ఇప్పుడు ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. మోడీ, కేసీఆర్‌లకు దేశ, రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగిస్తే ప్రజలను ఆగం చేస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని, ఎనిమిదేళ్లలో మోడీ, కేసీఆర్.. ప్రజలపై 36 లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోపారని చెప్పారు.