- నేడు నిరుద్యోగ ర్యాలీ, నిరసన సభ
- ఉత్తమ్, కోమటిరెడ్డి హాజరుపై సస్పెన్స్
నల్గొండ, వెలుగు : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఆయన పీసీసీ బాధ్యతలు చేపట్టి నప్పటి నుంచి నల్గొండలో సభ పెట్టాలని భావించారు. కానీ పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు పడుతుండడంతో ఆయన పర్యటనకు బ్రేక్‌లు పడ్డాయి. ఈనెల 26న నల్గొండలో నిరుద్యోగ ర్యాలీ, నిరసన సభ పెట్టాలని రేవంత్ ప్లాన్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో తనకు ముందస్తు సమాచారం లేకుండా రేవంత్టూర్ ఖరారు చేయడాన్ని ఉత్తమ్ సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ హైకమాండ్ వద్దకు ఇష్యూను తీసుకెళ్లడంతో అది ఆగిపోయింది. రేవంత్ కూడా పట్టుబట్టి హైకమాండ్‌ను ఒప్పించి శుక్రవారం నల్గొండలో నిరుద్యోగ మార్చ్ సభ నిర్వహించనున్నారు. రెండు రోజుల కిందటే రేవంత్ టీమ్ నల్గొండకు చేరుకుని సభను సక్సెస్ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. రేవంత్ పర్యటన డిసైడ్ కావడంతో ఆయన వర్గానికి చెందిన లీడర్లతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు సభ సక్సెస్‌పై దృష్టి పెట్టారు. నల్గొండ, నకిరేకల్, మునుగోడు, మిర్యాలగూడ, సూర్యాపేట, ఆలేరు, దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు ప్లాన్ చేశారు. రేవంత్ కు సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆశీస్సులు ఉండటంతో నాగార్జునసాగర్, మి ర్యాలగూడ నుంచి జానా కొడుకు రఘువీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ జన సమీకరణ చేస్తున్నారు. పార్టీ టికెట్లు ఆశిస్తున్న కొండేటి మల్లయ్య, బీర్ల అయిలయ్య, చల్లమల్ల కృష్ణారెడ్డి, పున్నా కైలాశ్ నేత కూడా జనాన్ని తరలించేందుకు సిద్దమవుతున్నారు. చౌటుప్పుల్ నుంచి చిట్యాల, నార్కట్‌పల్లి మీదుగా ఎంజీ యూనివర్సిటీ వరకు కార్లు, బైకులతో ర్యాలీ జరుగనుంది. నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు, పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, శంకర్ నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, చెరుకు సుధాకర్ తదితరులు రేవంత్ సభ ఏర్పాట్లు, జన సమీకరణ పైన ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా గురువారం ఎంజీ యూ నివర్సిటీలోని విద్యార్ధి సంఘాలు, నల్గొండలోని పలు కోచింగ్ సెంటర్లు, లై బ్రరీలకు వెళ్లి రేవంత్ సభకు రావాలని నిరుద్యోగులను కోరారు.
ఎంపీలు వస్తారా?
ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నిరుద్యోగ ర్యాలీకి హాజరవుతారా లేదా అన్నది గురువారం రాత్రి వరకు సస్పెన్స్‌గానే ఉంది. గురువారం గాంధీ భవన్లో జరిగిన దీక్షకు రేవంత్ హాజరుకాలేదు. దీంతో ఉత్తమ్ రాకపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు వేరే కార్యక్రమం ఉన్నందువల్ల ర్యాలీకి రాకపోవచ్చునని ఎంపీ వెంకటరెడ్డి ఇదివరకే చెప్పారు. నల్గొండలో జన సమీకర ణ బాధ్యతలు దుబ్బాక నర్సింహారెడ్డి, చెరుకు సుధాకర్‌కు అప్పగించడాన్ని వెంకటరెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. మల్లయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, చెరుకు సుధాకర్ ఎంపీ వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నకిరేకల్‌లో సభ పెట్టి ఆయన పై విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డిని టార్గెట్ చేసిన అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సపోర్ట్‌తోనే ఇదంతా జరుగుతుందంటున్న వెంకటరెడ్డి, రేవంత్ సభకు తన వర్గం నేతలెవరూ హాజరుకావద్దని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సభకు ఇద్దరు ఎంపీలు వస్తారని డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ చెప్తున్నారు. వారు క్లాక్‌టవర్ వద్ద జరిగే సభలో పాల్గొంటారని చెప్పారు. సీనియర్ నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ ఈ టూర్లో పాల్గొంటున్నారు.
రేవంత్ పర్యటన ఇలా..
రేవంత్ రెడ్డి మధ్యాహ్నం2.30 గంటలకు చౌటుప్పుల్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. 3 గంటలకు చిట్యాల, 3.30 గంటలకు నార్కట్‌పల్లికి చేరుకుంటారు. నార్కట్‌పల్లి నుంచి బైక్ ర్యాలీ మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఎంజీ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల తో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు నల్గొం డలోని మర్రిగూడ బైపాస్ వద్ద జగ్జవన్ రాం, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి పాదయాత్ర ప్రారంభిస్తారు. రాత్రి 7 గంటలకు క్లాక్ టవర్ సెంటర్ వద్ద సభ జరుగుతుంది.