డబుల్ ఇంజిన్ అంటేనే అదానీ, ప్రధాని : రేవంత్ రెడ్డి 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డారు. నిజామాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశాన్ని అదానీ, అంబానీలకు దోచి పెడ్తున్నారని ఆరోపించారు. హిడెన్ బర్గ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అదానీకి సపోర్ట్ గా నిలబడుతుందని, అందుకే ఇన్నీ ఆరోపణలు వచ్చినా అదానీ సంస్థలపై విచారణ జరిపించడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు రేవంత్.

అదానీ షేర్ విలువలు పెంచుతూ పెట్టుబడులు పెట్టించారు. తర్వాత అదానీ ఇచ్చిన ముుడపులను విదేశాలకు తరలిచారని అన్నారు. రాఫెల్ కాంట్రాక్టులు, పోర్టులన్నీ అదానీ, అంబానీ సంస్థలకే కట్టుబెడుతున్నారని విమర్శించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయడం లేదో కేంద్రం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ఆరోపణలు వస్తే జేపీసీలు వేశామని గుర్తుచేశారు. అదానీ, ప్రధాని వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని రేవంత్ అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వంలో యూనివర్సీటీలకు, ప్రాజెక్టులకు చేసిందేంలేదని రేవంత్ విమర్శించారు. వాళ్లు చేసిందల్లా 3000 బెల్టు షాపులు, 30,000 వైన్ షాపులేనని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ లకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.