బిల్లా- రంగాల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు : రేవంత్ రెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్ నగరంలోని ఎమ్మెల్యేలు భూకబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా భూకబ్జాలే కనిపిస్తున్నాయన్నారు. కబ్జాల కారణంగా నాళాలు కుంచించుకుపోయి.. చెరువులు కనుమరుగై భారీ వరదలకు వరంగల్ నగరం మునిగిపోయిందన్నారు. మరో ఏడాదిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 

ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉందని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏనుమాముల మార్కెట్ దళారుల పాలైందని రైతులు తమ గోడు వినిపించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారింది. వరంగల్ ఏకశిల పార్కు తాగుబోతులకు అడ్డాగా మారింది. కాళోజీ కళాక్షేత్రం మొండిగోడలతో నిలబడ్డది. కేసీఆర్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమయ్యాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వలేదు. తొమ్మిదేళ్లు పూర్తైనా అమరుల స్థూపం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కూడా పూర్తి కాలేదు. ఆ దయాకర్ ఏక్ నెంబర్ అయితే ఈ దయాకర్ దస్ నెంబర్’ అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. 

ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్టానం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం జెండాలు మోసిన కార్యకర్తలను ఆదుకునే కార్యాచరణను తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘బిల్లా- -రంగా మాదిరిలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక దండుపాళ్యం ముఠా. దండుపాళ్యం ముఠాకు హన్మకొండ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నాను. రోజులు లెక్కపెట్టుకోండి. గోడమీద రాసి పెట్టుకోండి. దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తాం. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. అధికారులు నిబంధనలకు లోబడి పని చేయాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు తప్పవు’ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.