- రైతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పవర్లోకి రావాలె
- మేం అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటిస్తం
- కేసీఆర్ సర్కార్ ఓ పేకమేడ.. అది కూలిపోయే రోజు వచ్చింది
- నిరుద్యోగం, దళిత, గిరిజన, మహిళా సమస్యలపైనా సభలు పెడ్తం
- ఎలక్షన్స్‌కు ముందు చివరగా రాహుల్‌తో ధర్మయుద్ధ సభ
- మా మధ్య విభేదాలు లేవు.. అవి భిన్నాభిప్రాయాలు మాత్రమే
- ‘వీ6-వెలుగు’ఇంటర్వ్యూలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: వరంగల్ సభతో కేసీఆర్ సర్కారుకు సమాధి కడ్తామని, కాంగ్రెస్ సత్తా చూపిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పెట్టినం. టీఆర్ఎస్ సర్కారుకు ఇక మూడినట్లే. కేసీఆర్ మోసకారి పాలనను రాష్ట్రంలో ఎవ్వరూ నమ్మడం లేదు. ఏడేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప బాగుపడిన వాళ్లు ఒక్కరూ లేరు”అని ఆయన అన్నారు. మే 6, 7 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ‘వీ6 వెలుగు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
రేవంత్ ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే..
ఎన్నికలకు ముందు ధర్మ యుద్ధ సభ
కేసీఆర్ సర్కారుకు చావు డప్పు మోగించేందుకే వరంగల్‌లో సభ పెట్టాం. 30 ఏండ్లలో ఎన్నడూ జరగని రీతిలో సభను నిర్వహిస్తున్నాం. లక్షలాది మంది రైతులు సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతు సంఘర్షణ సభ తర్వాత నిరుద్యోగులు, మహిళలు, దళిత- గిరిజనులు, బలహీన వర్గాల కోసం వేర్వేరుగా సంఘర్షణ సభలు పెడుతం. వీటన్నింటికీ రాహుల్ హాజరవుతారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధర్మయుద్ధ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సర్కారుకు సమాధి కడుతం.
కేసీఆర్ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు
రాష్ట్రంలో రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. కేసీఆర్ మోసపూరిత విధానాలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బాధ, నకిలీ విత్తనాలు, గిట్టుబాటు ధర లేకపోవడం లాంటి ఎన్నో ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ సభలో రైతుల గోసను ఆవిష్కరించడంతోపాటు మేం అధికారంలోకి రాగానే ఏం చేస్తామో ‘సమగ్ర వ్యవసాయ విధానం’పేరిట డిక్లరేషన్ అనౌన్స్ చేయబోతున్నాం. వరంగల్ సభ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు రాహుల్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటాయి. రైతుల సమస్యలు తీరాలంటే కాంగ్రెస్ పవర్లోకి రావాలి.
పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు
వరంగల్‌ను వేదికగా ఎంచుకోవడానికి ప్రత్యేక కారణముంది. సమ్మక్క, సారలమ్మ, చాకలి ఐలమ్మ, కాళోజీ, ప్రొఫెసర్జయశంకర్ లాంటి తెలంగాణ పోరాట యోధుల పురిటి గడ్డ వరంగల్. అక్కడి గాలీ, నీరు, నేల తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతిబింబం. వరంగల్ టీఆర్ఎస్కు కంచుకోట అనుకుంటున్నారు. దాన్ని బద్దలు కొట్టేందుకే ఈ ప్రాంతాన్ని సభ కోసం ఎంచుకున్నాం. సభ తర్వాత కేసీఆర్ గద్దె కుప్పకూలడం ఖాయం. కేసీఆర్ సర్కారు పేకమేడ లాంటిది. దాన్ని తన్నేటోడు లేకనే ఆయన ఇంకా కుర్చీలో ఉన్నాడు. అది కూలిపోయే రోజు వచ్చింది
పర్మిషన్ ఇవ్వకున్నా ఉస్మానియాకు వెళ్లి తీరుతం
ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చే విషయంలో కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా గడ్డకు రాహుల్ వస్తే స్వాగతించి.. యూనివర్సిటీ అణువణువూ ఆయనకు చూపించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంటుంది. కేసీఆర్‌కు రావడం ఇష్టం లేకపోతే కేబినెట్లో కొందరిని పంపి ఉస్మానియా వైభవాన్ని రాహుల్‌కు వివరించడం రాష్ట్రానికే గర్వకారణమవుతుంది. కానీ కేసీఆర్ చౌకబారు, సంకుచిత ఆలోచనలు చేస్తున్నారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థుల అరెస్టులతో బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థుల కోరిక మేరకే మేం రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ ప్లాన్ చేశాం. పర్మిషన్ ఇవ్వకపోయినా ఓయూ వెళ్లి తీరుతాం.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం
సీఎం కేసీఆర్ డిసెంబర్లో సర్కారును రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని మాకు సమాచారం ఉంది. దానికి తగినట్లుగా మేం ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాం. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని రాహుల్ చెప్పారు. వీలైతే ఇంకో మూడు నెలల ముందే ప్రకటిస్తాం. అభ్యర్థులను ప్రకటించేందుకు మాకు ఎక్కువ సమయం అవసరం లేదు. కేసీఆర్ కదలికలను బట్టి మేం నిర్ణయాలు తీసుకుంటాం.
పొత్తులపై ఏఐసీసీదే నిర్ణయం
సునీల్ కనుగోలు కాంగ్రెస్‌తో పని చేస్తున్నారు. ఆయనను ఏఐసీసీ నియమించింది. ఆయన ఇక్కడి వ్యవహారాలను నేరుగా రాహుల్‌తో మాత్రమే షేర్ చేసుకుంటారు. అందుకే మాకు ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. పీకే కాంగ్రెస్‌లో చేరకపోవడం వల్ల నష్టమేమీ లేదు. ఆయన చేరితే మాతో కలిసి పని చేసేవాడు. కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చి చేరుతామన్నా, పార్టీ కోసం పని చేస్తామన్నా ఆహ్వానిస్తాం. రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందనే విషయం మా పరిధిలోని అంశం కాదు. పొత్తుల విషయంలో ఏఐసీసీ ఎట్ల చెబితే మేం దాన్ని ఫాలో అవుతాం.
కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి విభేదాలున్నయ్
1885లో కాంగ్రెస్ పుట్టిన నాటి నుంచి పార్టీలో విభేదాలున్నాయి. కాంగ్రెస్‌లో ఎప్పుడైనా భిన్నాభిప్రాయాలు ఉంటాయి తప్ప భేదాభిప్రాయాలు ఉండవు. నెహ్రూ, సుభాస్ చంద్రబోస్, వల్లభ్‌భాయ్ పటేల్, చివరకు ఆర్ఎస్ఎస్ స్థాపకుడు హెగ్డేవార్ కూడా కాంగ్రెస్‌లో ఉండేవారు. అంశాలవారీగా విభేదించేవారు. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ కూడా జీ–23 లాంటి గ్రూపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అయినా పార్టీ మనుగడ సాగిస్తోంది. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ నాడు స్వాతంత్య్రం సాధించి తర్వాత ప్రభుత్వాలను నెలకొల్పింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రయాణం ఇలాగే సాగుతుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కూడా భేదాభిప్రాయాలు ఉంటే పరిష్కరించుకుంటాం. ఏదైనా తప్పు చేసినా సవరించుకొని అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. విభేదాలు టీఆర్ఎస్, బీజేపీలో కూడా ఉన్నాయి. ఆ పార్టీల నేతలు కూడా ఓపెన్‌గా కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పని చేసే పార్టీ. ఆ క్రమంలో నేతల మధ్య భేదాభిప్రాయాలు చిన్న విషయం.
కేసీఆర్ కలిసి వస్తామంటే మద్దతు తీసుకుంటం
కేసీఆర్ రాహుల్ దగ్గరికి వచ్చి తమ పార్టీని విలీనం చేస్తామని, కాంగ్రెస్ కోసం పని చేస్తామని చెప్పినా ఆయన మద్దతు తీసుకుంటాం. కాంగ్రెస్‌లోకి త్వరలో భారీ వలసలు ఉంటాయి. అన్ని పార్టీల వాళ్లు మాతో టచ్‌లో ఉన్నారు. కేటీఆర్ తమ ప్రధాన ప్రత్యర్థి అని కేఏ పాల్ అంటున్నారు. తండ్రీకొడుకులు ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడుతారు. కేసీఆర్ ఒక మెంటల్. కేటీఆర్ ఒక శుంఠ.
మరిన్ని వార్తల కోసం...