
హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు హడావుడి చేయడంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ గురువారం ఓ ప్రకటనలో తీవ్రంగా మండిపడ్డారు. ఘటనా స్థలికి బీఆర్ఎస్ నేతలను, మీడియాను అనుమతించడం లేదని హరీశ్ ఆరోపించారని, మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉన్నప్పుడు మీడియాను కిలోమీటర్ల దూరంలో ఆపేసిన చరిత్ర బీఆర్ఎస్ ది కాదా అని మహేశ్ గౌడ్ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
‘‘మీరు (బీఆర్ఎస్ నేతలు) ఏ నిపుణులను అడిగి కాళేశ్వరం కట్టారు? అది ఎందుకు కూలిపోయిందో చెప్పగలరా? రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రాణాలు పోలేదా? బాహుబలి మోటార్లు వరద నీటిలో మునిగిపోలేదా? ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రతిపాదికన పనులు చేయిస్తుంటే ఇందులో కూడా కోడి గుడ్డుపై ఈకలు పీకుతున్నారు. శవాలపై పేలాలు ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు” అని మహేశ్ గౌడ్ విమర్శించారు. ఘటనా స్థలంలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, గల్లంతయిన వారి ఆచూకీని గుర్తించే పనిలో ఉన్నారని ఆయన తెలిపారు. మీడియా పారదర్శకంగా రిపోర్టింగ్ చేస్తుంటే, హరీశ్‌రావు అక్కడకు వెళ్లి పనికి ఆటంకం కలిగిస్తున్నారని ఫైర్ అయ్యారు.