- మేం ప్రక్షాళన పేరుతో డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మూసీలో దుంకుత.. లేదంటే కేటీఆర్ దుంకాలె
- 1,600 చెరువులను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఫైర్
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మూసీకి, రాహుల్ గాంధీకి సంబంధమేంటి? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మూసీకి, రాహుల్ గాంధీకి ముడిపెడుతూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ‘‘మంత్రులతో కలిసి నేను పురాణాపూల్ బ్రిడ్జి వద్దకు వస్తాను. కేటీఆర్ నువ్వు కూడా రా.. మూసీ ప్రక్షాళన పేరుతో మేం ఒక్క రూపాయి తీసుకున్నట్టు నిరూపించినా నేను మూసీలో దుంకుత.. లేదంటే నువ్వు దుంకాలి” అని సవాల్ విసిరారు.
బుధవారం గాంధీభవన్ లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. చెరువులను, కుంటలను కాపాడడమే హైడ్రా ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ‘‘హైడ్రా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. హైడ్రాతో కేవలం బీఆర్ఎస్ నేతలే బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్లే 1,600 చెరువులను కబ్జా చేశారు’’ అని అన్నారు. ‘‘మూసీ చుట్టూ ఒక్క ఇంటిని కూడా ఇప్పటి వరకు తొలగించలేదు. దాని చుట్టూ ఉన్నోళ్లకు చట్టబద్ధంగానే నష్టపరిహారం ఇస్తాం. మూసీ సుందరీకరణకు చాలా సమయం పడుతుంది. మూసీ ప్రక్షాళనకు వందల కోట్ల రూపాయలు చాలు” అని చెప్పారు. .
కేసీఆర్.. ఎక్కడ దాక్కున్నారు?
మూసీ ప్రక్షాళన అంశాన్ని తెరమీదకు తెచ్చిందే కేసీఆర్ అని పీసీసీ చీఫ్ మహేశ్ చెప్పారు. 2016లో మూసీ ప్రక్షాళనను ముందుకుతెచ్చింది కేసీఆరేనని గుర్తు చేశారు. గత ఆరు నెలలుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడ దాక్కున్నారో కేటీఆర్ చెప్పాలన్నారు. ‘‘మహిళా మంత్రి కొండా సురేఖపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇప్పటి వరకు కేటీఆర్ స్పందించలేదు. బావ హరీశ్ కు ఉన్న సోయి బామ్మర్దికి లేదు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. ఇరిగేషన్, లిక్కర్ పేరు మీద రాష్ట్రాన్ని లూటీ చేశారు” అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, సమయం చూసి తమ వద్దకు వస్తారని చెప్పారు.