రెండో రోజుకు ప్రజాహిత పాదయాత్ర
నవాబుపేట, వెలుగు : గ్రామాల్లోని సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అప్పుపాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని హన్మసాన్పల్లి, కూచూరు, దొడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లి, ఇప్పటూరు గ్రామాల్లో ప్రజాహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరిట జనాలను మోసం చేస్తున్నారన్నారు. రిజర్వాయర్ల పేరుతో కమీషన్ల దందా చేస్తూ, బాధితులను ఆదుకోవడం లేదని విమర్శించారు. గ్రామాలను డెవలప్ చేస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలకు నిధులు కేటాయించకుండా, బిల్లులు చెల్లించకుండా తిప్పలు పెడుతున్నారన్నారు.
ఉద్యోగాలు లేక విద్యావంతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేసి చూపిస్తానని తెలిపారు. రబ్బాని, వాసుయాదవ్,సేవాదళ్నాయకులు వాజిద్ మహేక్, హమీద్ మహేక్, బంక వెంకటయ్య, తుల్సీరాం నాయక్, కూచూరు వెంకటయ్య, మీనాక్షి పాల్గొన్నారు.