కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి పురుమల్ల శ్రీనివాస్ కు టీపీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని, కాంగ్రెస్ హవా ఉన్నప్పటికీ పరోక్షంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు మేలు జరిగేలా వ్యవహరించారని, వ్యక్తిగత ఇమేజ్ కోసం ఎక్కువగా ఆరాటపడ్డారని పలువురు కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు.
నియోజకవర్గ ఇన్ చార్జీగా కరీంనగర్ పరిధిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడడాన్ని పార్టీ తప్పుబట్టింది. పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించినా..గెలుపు కోసం ప్రచారంలో ఎందుకు చురుగ్గా పాల్గొనలేదని నోటీసుల్లో ప్రశ్నించింది. అప్పటి చత్తీస్గఢ్సీఎం కరీంనగర్ ఎన్నికల ప్రచారానికి వస్తే స్థానిక నాయకులకు ఎందుకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, సభ నిర్వహించడంలోనూ ఎందుకు విఫలమయ్యారని వివరణ కోరింది.
ఏఐసీసీ సమన్వయకర్తలు, పరిశీలకుల సూచనలను పెడచెవిన పెట్టడమేగాక..అసమర్థత, నిర్లక్ష్య ధోరణులతో పరోక్షంగా బీఆర్ఎస్, బీజేపీలతో కుమ్మక్కయినట్లుగా భావిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఆరోపణలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే మూడు, నాలుగు రోజుల్లోనే వేటు వేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు.