కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది టీపీసీసీ. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు వేధిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్. రాత్రి పూట కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు వెళ్లి దాడులు చేస్తున్నారని పిటిషన్ లో తెలిపారు.
మే 4న మండ సాయి ప్రతాప్ ఇంటిపై తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు రైడ్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు చెందిన మొబైల్ ఫోన్లు తీసుకెళ్లారు. పాస్ వర్డ్ చెప్పాలని బలవంతం చేశారు. తనిఖీలపై ఢిల్లీ పోలీసులు రాష్ట్ర డీజేపీకి కూడా సమాచారం ఇవ్వ లేదు . కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మహేశ్ కుమార్.
ఏప్రిల్ 23న సిద్దిపేటలో బహిరంగ సభలో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్ రెడ్డి టీపీసీసీ మీడియా టీంపై ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు టీ పీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ ఏ1, మన్నె సతీష్ ఏ2, నవీన్ఏ3, ఆస్మా తస్లీమ్ ఏ4, గీత ఏ5లను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. వీళ్లకు నాంపల్లి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతీ సోమ, శుక్రవారాలు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది.