సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేల కోట్ల రూపాయలతో నిర్మించిన యాదాద్రి ఆలయ నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. వందేళ్లయినా చెక్కు చెదరదన్న ఆలయం ఒక్క వానకే బురుదమయంగా మారింది. ఘాట్ రోడ్లు కుంగిపోగా... కాంప్లెక్స్, క్యూ లైన్లలోకి నీళ్లు చేరాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నదులకు నేర్పిన నడకలు, కారుకు లొంగని దారులు ఇవేనంటూ సెటైర్లు వేశారు. గఫ్ఫాలు కొట్టిన అభివృద్ధి మొత్తం ఒక్క వానకే బయటపడిందంటూ విమర్శించారు. కమీషన్, కలెక్షన్, కరప్షన్... ఈ మూడింటి కలయికే కేసీఆర్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా...యాదాద్రిలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో నారసింహుడి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు కుంగిపోయింది. కొండ పైకి రాకపోకలకు బ్రేక్ పడింది. కాలినడకనే భక్తులు కొండపైకి వెళ్ళారు. కొన్ని రోజుల క్రితమే వందల కోట్ల రూపాయలతో ఈ ఘాట్ రోడ్డు నిర్మించారు. వర్షం ధాటికి నాసికరం పనులు బయటపడ్డాయి. ఆలయ కొత్త ఘాట్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్ రోడ్లు కోతకు గురయ్యాయి. ప్రెసిడెన్షియల్ సూట్ సర్కిల్ తో పాటు రింగ్ రోడ్ చెరువులాగా మారింది. కొండ పైకి ఎక్కే ఘాట్ రోడ్డు బురదమయం కావడంతో బస్సులు దిగబడ్డాయి. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జేసీబీ సాయంతో బురదను ఎత్తివేశారు అధికారులు. కాంప్లెక్స్, క్యూలైన్లలోకి వర్షపు నీరు చేరింది. ఈదురు గాలులకు కొండపైన చలువ పందిళ్లు కుప్పకూలాయి. యాదాద్రిపై నాసిరకంగా నిర్మాణ పనులు చేయడంతోనే ఇలా రోడ్ కుంగిపోయిందని భక్తులు మండిపడుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంగా పనులు చేశారని ఆరోపిస్తున్నారు. యాదాద్రి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి దాదాపు 2 వేల కోట్లు ఖర్చుచేసినా....పనుల్లో నాణ్యత లేదనే విమర్శలు వస్తున్నాయి.
Commission + Collection + Corruption = Chandrasekar rao https://t.co/u5NrqY0KBg
— Manickam Tagore .B??✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 4, 2022