పఠాన్ చెరు ఘటనపై టీపీసీసీ సీరియస్.. విచారణకు కమిటీ ఏర్పాటు

పఠాన్ చెరు ఘటనపై టీపీసీసీ సీరియస్.. విచారణకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్: పఠాన్ చెరు కాంగ్రెస్‎లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసుపై నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు దాడి చేయడం ఇరు వర్గాల మధ్య అగ్గి రాజేసింది. నేతల మధ్య వర్గ పోరు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో పఠాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్‎లో జరుగుతోన్న పరిణామాలపై టీపీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పటాన్ చెరు కాంగ్రెస్‎లో చోటు చేసుకున్న ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డిల కమిటీ సభ్యులుగా నియమించిన టీపీసీసీ.. పఠాన్ చెరు ఘటనపై విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

కాగా.. పఠాన్ చెరు కాంగ్రెస్‎లో వర్గ విభేదాలు తారాస్థాయికు చేరుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గ పోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యే గూడెం అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని.. కాంగ్రెస్ నేతలపైన దాడులు చేయిస్తున్నారని గురువారం (జనవరి 23) కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్ది దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. 

దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చేసుకుంది. ఇదిలా ఉండగానే.. కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు పఠాన్ చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడించారు. ఎమ్మె్ల్యే క్యాంఫ్ ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు కుర్చీలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాట శ్రీనివాస్ గౌడ్‎పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కాట, గూడెం మధ్య వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరడంతో పఠాన్ చెరు నియోజకవర్గ పరిణామాలపై కాంగ్రెస్ విచారణకు ఆదేశించింది