హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్న పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోయాయని, వీటిని నియంత్రించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కుక్కలను రోడ్లపై తిరగనీయకుండా అధికారులు వెంటనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కోరారు.
గ్రేటర్ పరిధితో సహా వరంగల్ ఎంజీఎం, ఇబ్రహీంపట్నం, నార్సింగిలో జరిగిన ఘటనలు బాధాకరమని తెలిపారు. దీనిపై తాను సంబంధిత అధికారులకు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. చివరకు హైకోర్టు కూడా కుక్కల దాడుల ఘటనలను సుమోటోగా తీసుకొని అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఇలాంటి సమస్యలపై అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పైన పడుతుందని పేర్కొన్నారు.