మే 6న వరంగల్లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. మే 6 మధ్యాహ్నం 2గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న రాహుల్ అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ వెళ్లనున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రాహుల్ గాంధీ సభ జరగనుంది.
మే 6న రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభాస్థలిని టీపీసీసీ నేతలు పరిశీలించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.