ఇయ్యాల బెల్లంపల్లిలో రేవంత్ రెడ్డి సభ

  •  గడ్డం వినోద్  ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి

 బెల్లంపల్లి, వెలుగు:  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు టీపీసీసీ ప్రెసిడెంట్  రేవంత్  రెడ్డి  హాజరుకానున్నారు. ఈ మేరకు శుక్రవారం కార్యకర్తలు, లీడర్లు  పార్టీ బెల్లంపల్లి అభ్యర్థి,  రాష్ట్ర మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంను ముస్తాబు చేశారు. ఈ సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. రేవంత్ సభకు నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండలంతో పాటు తాండూర్, కన్నేపల్లి, భీమిని,  నెన్నెల, కాసిపేట, వేమనపల్లి మండలాలకు చెందిన  కార్యకర్తలు, లీడర్లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలను సభకు హాజరయ్యే విధంగా వినోద్ చూసుకుంటున్నారు.

 ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లిలో  సభ ఏర్పాట్లను వినోద్ లీడర్లు, కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. దాదాపు 30 వేల మందితో బెల్లంపల్లిలో బహిరంగ సభ జరుగుతుందని  వెల్లడించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని మారుమూల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు  నిమగ్నమై ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

ఆయన వెంట ఏఐసీసీ సెక్రటరీ,  పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకుడు మోహన్ జోషి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కేవి ప్రతాప్, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్  ముచ్చర్ల మల్లయ్య , ఏఎంసీ మాజీ చైర్మెన్ కార్కూరి రాంచందర్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపెల్లి ఉదయ్ కాంత్, మహిళా నాయకురాలు కంకణాల పద్మా రెడ్డి, టీపీసీసీ  సభ్యుడు చిలిముల శంకర్, లీడర్లు సత్తి బాబు, దెవసాని ఆనంద్ తదితరులు ఉన్నారు.