దిమ్మలు కూల్చినా... కార్యాలయాలు తగులబెట్టినా మా గెలుపును ఆపలేరు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే తమ పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం అర్ధరాత్రి మునుగోడు నియోజవర్గం చండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అందులోని పార్టీ జెండాలు, కండువాలు, బ్యానర్లకు నిప్పు పెట్టారు. దీంతో అవి కాలి బూడిదయ్యాయి. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయంలోకి వచ్చి పార్టీ సామగ్రిని తగులబెట్టడం దారుణమన్నారు. ఇవాళ మునుగోడులో తన పర్యటనను అడ్డుకునేందుకే ప్రత్యర్థులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు.

ఇలాంటి దుర్మార్గపు చర్యల వల్ల కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. పార్టీ దిమ్మెలు కూల్చినా.. కార్యాలయాలు తగులబెట్టినా... మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని స్పష్టం చేశారు. తమ పార్టీపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.