న్యూఢిల్లీ: రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలాడుతున్నాయన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో రెండు పార్టీలు రైతులను మోసం చేశాయన్నారు. 2022 లో రైతుల ఆదాయం రెట్టంపు చేస్తానన్న బీజేపీ.. కనీసం వడ్లు కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాకపోవడం సిగ్గు చేటన్నారు. రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం, లేదు లేదు బాయిల్డ్ రైస్ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం తిట్టుకుంటూ పెద్ద డ్రామాకు తెరలేపాయన్నారు.
వరికి రూ.1960 కనీస మద్ధతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారని, అందుకే కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లను సంప్రదించాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలోనే మిల్లర్లు ఇష్టమొచ్చినట్టు ధర నిర్ణయిస్తూ దోపిడికి పాల్పడుతున్నారన్నారు. దమ్ముంటే రైతులను దోచుకుంటున్న మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో పెట్టాలని సీఎం కేసీఆర్ కు సవాలు విసిరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన, 7న హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం: