- కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై పీసీసీ తీర్మానం
- ఆయనకే తిరిగి టికెట్ ఇవ్వాలని హైకమాండ్ కు విజ్ఞప్తి
- మహేశ్ గౌడ్, మున్షీతో మంత్రులు, సీనియర్ల భేటీ
- కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ముఖ్య నేతలు హాజరు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోటీ చేయించాలని ఆ నాలుగు ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతల సమావేశం తీర్మానించింది. గురువారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో పాటు కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఇన్చార్జి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికే తిరిగి చాన్స్ ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. తీర్మానం కాపీని హైకమాండ్ కు పంపించేందుకు పీసీసీ సిద్ధమవుతోంది.
సిట్టింగ్ సీటును గెలిపించుకోవాలి: మహేశ్ గౌడ్
ఈ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినందున కలిసికట్టుగా పని చేసి తిరిగి గెలిపించుకోవాలని పార్టీ క్యాడర్ కు మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో యువత, టీచర్లు, ఇతర ఉద్యోగులు కీలమైనందున.. ఆ వర్గాలకు ఏం చేశామనేది విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఓ కమిటీని నియమించడంతోపాటు జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇంచార్జీలను కూడా నియమిస్తామన్నారు. జీవన్ రెడ్డి పోటీకి సిద్ధంగా లేకపోతే కులం, జిల్లాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త అభ్యర్థికి చాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. కరీంగనర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం పరిధిలోని మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తారన్నారు.
అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తది: జీవన్ రెడ్డి
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్ప, తాను పోటీ చేయడంపై ఇప్పుడేమీ చెప్పలేనన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని, వ్యక్తిగత నిర్ణయాలు అనేవి కాంగ్రెస్ లో ఉండవన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై చర్చ జరిగిందన్నారు.
మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని తిరిగి పోటీ చేయించాలన్న నిర్ణయంపై కాంగ్రెస్ లోని పలువురు సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చివరి చాన్స్ అంటూ గెలిచారని.. ఇప్పుడు మళ్లీ ఆయనకే చాన్స్ ఇస్తే పార్టీలోని ఇతర సీనియర్లు, మహిళలు, యువత, ఇతర వర్గాల పరిస్థితి ఏమిటని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగిత్యాల టికెట్ ను ఇస్తే ఓడిపోయారని, ఆయనకే మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని విమర్శిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి పలువురు సీనియర్లు ఆసక్తిగా ఉన్నా, పీసీసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అంటున్నారు. జీవన్ రెడ్డికి అనుకూలంగా తీర్మానం చేస్తారని ముందే తెలిసినందుకే ఓ మంత్రి ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టారని, ఆయన బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా గైర్హాజరయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా పార్టీ హైకమాండ్ యువతను ప్రోత్సహిస్తున్న సమయంలో జీవన్ రెడ్డికి మరోసారి చాన్స్ ఇవ్వొద్దని ఫిర్యాదు చేసేందుకు కూడా పలువురు సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.