- మూరెడు లేడు గానీ ఎమ్మెల్యే కిషోర్ మూసీని మింగిండు
- కేసీఆర్ సారాలో సోడా పోసేటోడు మంత్రి అయిండు
- పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లింగయ్యను అసెంబ్లీ గేటు కూడా తాకనీయొద్దు
- మహాయోధులు పుట్టిన గడ్డ మీద మాఫియా రాజ్యమేలుతోంది
నకిరేకల్ / తుంగతుర్తి / ఆలేరు వెలుగు : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నల్గొండ జిల్లాలో ప్రస్తుతం కబ్జాకోరులు ఎమ్మెల్యేలు గా ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నకిరేకల్, తిరుమలగిరి, ఆలేరులో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్ మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవీ త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన ఈ జిల్లాలో ఇసుక దొంగతనం చేసేటోడు, చెరువులు కబ్జా పెట్టెటోళ్లు, భూములు ఆక్రమించుకునేటోళ్లు ఎమ్మెల్యేలుగా ఉండడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లా ఆత్మగౌరవాన్ని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
మూరెడు కూడా లేని తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మూసీ అంతా మింగేసిండని, హైదరాబాద్‌లో ఏ ఇసుక లారీ ఆపి ఎవరిదని అడిగితే ఆయనదేనని చెప్తారని ఎద్దేవా చేశారు. ఈయన పక్కన ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి కేసీఆర్‌కు సమాయానికి సారాలో సోడా పోసేటోడని విమర్శించారు. నిజం రజాకారుల దురాగతాలను తరమికొట్టిన జిల్లాలో కేసీఆర్ సారాలో సోడే పోసే నాయకులు దాపురించారని అన్నారు. కాం గ్రెస్ పార్టీకి, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నమ్మకం ద్రోహం చేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అసెంబ్లీ గేటు తాకనీయకుండా చేయాలని పిలుపునిచ్చారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతోనే నకిరేకల్, తుంగతుర్తిలో అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందని, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సామేలును భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమకారులైన మందుల సామేలును భారీ మెజార్టీతో గెలిపించి, ఇసుక, దళితబంధు దొంగలకు బుద్దిచెప్పాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి జగదీశ్ రెడ్డి , తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఇద్దరూ కలిసి ఇసుక క్వారీలు పంచుకొని దోచుకుంటున్నారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు డిపాజిట్ రాకుండా చేయాలన్నారు.
నాగారంలో మూడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న జగదీశ్ రెడ్డి రూ. 5వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. మందుల సామేలు మాట్లాడుతూ.. .తుంగతుర్తి నుంచే యుద్ధం మొదలైందని, బీఆర్ఎస్ ప్ర భుత్వం బొందల గడ్డ శ్మశాన వాటికలు తప్ప డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించలేదన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా ఎప్పుడు మారిందో అప్పుడే బొందల పార్టీగా మారిపోయిందని విమర్శించారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే నేతి విద్యాసాగర్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, చెవిటి వెంకన్న యాదవ్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అద్దంకి దయాకర్, పూజర్ల శంభయ్య తదితరులు పాల్గొన్నారు.