చండూరు (మర్రిగూడ) వెలుగు: మునుగోడులో కాలేజీలు ఏర్పాటు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. ఏం వెలగబెట్టాడని మునుగోడుకు ఓట్లు అడగడానికి వస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి, దామెర భీమనపల్లి, శివన్నగూడలో సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వీధులన్నీ అధ్వానంగా ఉండి, మోరీలో తట్టెడు మట్టి పోయలేని సన్నాసి.. ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. రాజగోపాల్రెడ్డి దుష్మన్ తో దోస్తీ చేసి రూ.22వేల కోట్లకు అమ్ముడుపోయాడని, ఇలాంటి దుర్మార్గులను గెలిపిస్తే సమాజం బతకదన్నారు. ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం స్రవంతిని గెలిపిస్తేనే ప్రశ్నించే గొంతుకగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి అహంకారానికి, కేసీఆర్ అధికారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇదన్నారు. ఓట్లు కొనడానికే దత్తత పేరుతో సీఎం గ్రామాలకు వస్తున్నడన్నారు.