హైదరాబాద్: కాళేశ్వరం నుంచి మొదలు పెడితే కార్ రేసింగ్ వరకు అన్నింటిలో కేసీఆర్ అవినీతి బయట పడ్డదని టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అవినీతే జరగలేదని హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి ఇ సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పితేనే చేశామని స్వయానా అప్పటి అధికారులే విచారణలో చెప్పారన్నారు. ఏ తప్పు చెయ్యనప్పుడు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని, వాయిదాలు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్, కవిత, కేసీఆర్ అందరూ భాగస్వాములేనని అన్నారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను ప్రజలు నిలదీస్తరని, కానీ కేసీఆర్ చేసిన అవినీతిని వెలికి తీసేవరకు వదిలేది లేదని హెచ్చరించారు.
అవినీతికి కేసీఆర్ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్లని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోలు లో జస్టిస్ నరసింహా రెడ్డి కమిటీ విచారణకు పిలుస్తే కేసీఆర్ ఎందుకు గడువు అడుగుతున్నారని ప్రశ్నించారు. అవినీతికి కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. ఇప్పటికే కవిత లిక్కర్ కుంభకోణంలో జైల్లో ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో 5వేల పాఠశాలను మూయించారన్నారు. కానీ సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలు కూడా నడిపిస్తాం అని సీఎం చెప్పారని తెలిపారు. ఎన్నికల కోడ్ వల్ల కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై జరుగుతున్న విచారణ కొంత ఆలస్యమైందన్నారు. చివరకు సంతోష్ రావు కూడా హరిత హారంలో మొక్కల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి చేశాడని ఫైర్ అయ్యారు. గొర్రెలు, చేపల పంపిణీ నుంచి మొదలు పెడితే శానిటరీ ప్యాడ్స్ వరకు అన్నింటిలోనూ అవినీతి చేశారని మండిపడ్డారు.