అనిరుధ్​కు అండగా ఉండండి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అనిరుధ్​కు అండగా ఉండండి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్​రెడ్డికి నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలని టీపీసీసీ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జడ్చర్లలో అనిరుధ్​రెడ్డి నామినేషన్​ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్థానిక నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీటింగ్​ పాల్గొని ప్రసంగించారు. అనిరుధ్​రెడ్డిని నాలుగేండ్లుగా చూస్తున్నానని, కష్టం అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికీ చేతనైన సాయం చేసి ఆదుకుంటున్నాడని పేర్కొన్నారు. అలాంటివాడిని గెలిపించుకుంటే నియోజకవర్గ ప్రజలను గుండెలో పెట్టి చూసుకుంటాడని తెలిపారు.

సభకు హాజరైన ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే అనిరుధ్​రెడ్డి 50 వేల మెజార్టీతో గెలవబోతున్నాడని అర్థమవుతోందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంపై తనకు అవగాహన ఉందని, అనిరుధ్​ను గెలిపిస్తే తనతో పాటు జడ్చర్లకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారని పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా జడ్చర్ల ప్రజలకు అనిరుధ్​తో పాటు తాను అండగా ఉండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటుతో రాష్ట్రంలో 9 ఫ్యామిలీలు మాత్రమే బాగుపడ్డాయని, ప్రజలెవరూ బాగుపడలేదన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియాను ఇష్టం వచ్చినట్లు తిడుతున్న కేసీఆర్, కేటీఆర్​లకు ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయిన రైతులకు రూ.17లక్షల పరిహారం ఇచ్చిన కేసీఆర్,​ ఉదండాపూర్​ రిజర్వాయర్​ బాధితులకు మాత్రం రూ.5లక్షలే ఇచ్చాడని గుర్తు చేశారు.

తీన్మార్​ మల్లన్న మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులకు తమ శాఖలపైనే అవగాహన లేదని, అలాంటిది రాష్ట్ర ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. రైతుబంధు ద్వారా ఆరు నెలలకు రూ.5 వేలు ఇస్తున్న ప్రభుత్వం, మందు ధరలను పెంచి ఆరు నెలలకు రూ.18వేలు వసూలు చేస్తోందని విమర్శించారు. అనిరుధ్​రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో నాన్​లోకల్స్​కు ఏం పని అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూకబ్జాలు చేస్తూ, ఇసుక, మట్టిని అమ్ముతూ జడ్చర్లను కొల్లగొడుతున్నాడని ఆరోపించారు. అంతకుముందు తన క్యాంప్​ ఆఫీస్​ నుంచి వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​ ఆఫీస్​లో నామినేషన్​ దాఖలు  చేశారు.