నల్గొండ అర్బన్, వెలుగు : గ్రామ పంచాయతీలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొండేటి మల్లయ్య, పున్న కైలాశ్ నేత, తండు సైదులుగౌడ్‌తో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. దీంతో అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేశ్, నాయకులు అల్లి సుభాశ్ యాదవ్, పుట్ట కోటయ్య, చర్లపల్లి గౌతమ్, ఇంతియాజ్ అలీ పాల్గొన్నారు.
వటపత్రశాయిగా నారసింహుడి దర్శనం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారు శుక్రవారం ఉదయం వటపత్రశాయి అవతారంలో, సాయంత్రం వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చారు. అలంకార సేవ అనంతరం స్వామివారిని మాఢవీధుల్లో ఊరేగించారు. అధ్యయనోత్సవాల్లో చివరి రోజైన శనివారం స్వామివారు లక్ష్మీనరసింహస్వామి అవతారంలో దర్శనమివ్వనున్నారు.
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
హాలియా, వెలుగు : బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ పాలక్ కపిలవాయి దిలీప్‌కుమార్ సూచించారు. శుక్రవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ ఉపాధ్యక్షుడు తంగ రాజు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు కంచర్ల వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్ము రాందాసు, ఆరెబోయిన రాజు, వామనగిరి జయమ్మ పాల్గొన్నారు.
వర్చువల్ సభను సక్సెస్ చేయాలి
నల్గొండఅర్బన్/తుంగతుర్తి, వెలుగు : నల్గొండ పట్టణంలోని పార్టీ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశానికి నియోజకవర్గ పాలక్ గరికపాటి మోహన్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నిర్వహించే వర్చువల్ మీటింగ్‌ను సక్సెస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, జనరల్ సెక్రటరీ నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరిచారి పాల్గొన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య మాట్లాడారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించే వర్చువలే మీటింగ్‌కు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
అవినీతిపాలన అంతం చేసేందుకు రెడీ
సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనను అంతం చేసేందుకు బీజేపీ రెడీగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు చెప్పారు. సూర్యాపేట త్రివేణి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించే బూత్ కార్యకర్తల మహాసమ్మేళనానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ ద్వారా మాట్లాడుతారన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సూర్యాపేటలో కాషాయ జెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
స్టూడెంట్లు సైంటిస్టులుగా ఎదగాలి
యాదాద్రి, వెలుగు : స్టూడెంట్లు సైంటిస్టులుగా ఎదిగేందుకు టీచర్లు మార్గనిర్ధేశనం చేయాలని యాదాద్రి డీఈవో నారాయణరెడ్డి సూచించారు. బెంగళూరుకు చెందిన ‘రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ’ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ప్రభుత్వ టీచర్లకు ట్రైనింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సైంటిస్టుల అవసరం ఉందన్నారు. స్టూడెంట్లలో శాస్త్రీయ దృక్పథం, ఆలోచనలు పెంపొందేలా విద్యాభోదన చేయాలన్నారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సభ్యులు జయ తీర్థారావు, రీసోర్స్ పర్సన్ పద్మ ప్రభు, పీర్శావలి, కరీమా, సెక్టోరల్ ఆఫీసర్ శ్రీనివాస్, భరణికుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్న పోలీసులు
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో శుక్రవారం కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ లీడర్లను అడ్డుకున్నారు. ఎంపీ క్యాంప్ ఆఫీస్ వద్ద శుక్రవారం ఉదయం నుంచే పోలీసులను మోహరించారు. ఎస్‌టీవో ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చారు. అయితే ఆయన వెంట వచ్చిన కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించలేదంటూ, ఫ్లెక్సీలో తన ఫొటో లేదంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు వెంటనే ఫ్లెక్సీని తొలగించారు. మరో వైపు మంత్రి పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో నేరేడుచర్ల, మఠంపల్లి, మేళ్లచెర్వు మండలాలకు చెందిన బీజేపీ లీడర్లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
మిర్యాలగూడ అభివృద్ధే లక్ష్యం
మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృ-ద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చెప్పారు. నల్గొండ జిల్లా చింతపల్లి క్రాస్ రోడ్డు నుంచి ఇందిరమ్మ కాలనీ ఎన్‌ఎస్పీ కెనాల్ రెండో బ్రిడ్జి వరకు డబుల్ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్న మిర్యాలగూడ చుట్టూ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు నిర్మాణ పనులకు ఇన్‌టైంలో కంప్లీట్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్‌చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ సాధినేని స్రవంతి శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, సర్పంచ్ బాణావత్ లలిత సక్రు, ఆర్‌అండ్‌బీ డీఈ గణేశ్, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి పాల్గొన్నారు.
ఎంబీబీఎస్ స్టూడెంట్‌కు ఆర్థికసాయం
మిర్యాలగూడ, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆర్థికసాయం అందజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన షేక్ జహంగీర్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కూతురు సిమ్రాకు ఎంబీబీఎస్ సీటు వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాలేజీలో చేరలేకపోతోంది. ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ ఎండీ.జానీపాషా దృష్టికి రాగా శుక్రవారం హైదరాబాద్ వెళ్లి ఎంపీని కలిసి పరిస్థితి వివరించారు. స్పందించిన ఎంపీ వెంకట్‌రెడ్డి స్టూడెంట్‌కు మొదటి విడతగా రూ. 60 వేల ఆర్థికసాయం అందజేశారు. ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
దేవరకొండలో డయాలిసిస్ సెంటర్ ప్రారంభం
దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలిసిస్ సెంటర్‌ను శుక్రవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలిసిస్ సెంటర్ ఏర్పాటుతో కిడ్నీ రోగుల కష్టాలు తీరనున్నాయన్నారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేశ్‌గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, డీసీహెచ్ మాతృనాయక్, సూపరింటెండెంట్ రాములునాయక్ పాల్గొన్నారు.
మున్సిపల్ మీటింగ్‌కు పోలీస్ పహారా
కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ మీటింగ్ శుక్రవారం పోలీస్ పహారా మధ్య నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలో పనిచేసే 70 మంది కార్మికులను ఇటీవల తొలగించారు. దీంతో వారిని తొలగించడం సరైంది కాదని కొందరు కౌన్సిలర్లు, రూల్స్ పాటించకుండా కార్మికులను నియమించారని, వారి నియామకం చెల్లదని మరికొందరు కౌన్సిలర్ల మధ్య కొద్ది రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. దీంతో కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కార్మికులు ఇప్పటివరకు పనిచేసిన రోజులకు సంబంధించిన జీతం చెల్లించడంతో పాటు, డైలీ వేతనంతో మార్చి వరకు పనిలోకి తీసుకుంటామని తీర్మానం చేశారు. సమావేశం జరుగుతున్న టైంలో కార్మికులు, వారి బంధువులు మున్సిపల్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. దీంతో మున్సిపల్ ఆఫీసర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తమను ఉద్యోగాల్లోంచి తొలగించడం సరికాదని, రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.