
హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి వార్త ఇది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL 2025) నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు శనివారం తెలిపారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో టీపీఎల్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త కార్యదర్శి ఎన్నికల్లో గోవా క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన రోహన్ దేశాయ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో హెచ్‌సీఏ ప్రతినిధిగా జగన్ మోహన్ రావు పాల్గొని రోహన్ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. ఈ ఎన్నికల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవాజిత్ సైకియా, ట్రెజరర్ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాతో జగన్ మోహన్ రావు, హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్ సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో టీపీఎల్‌తో పాటు మొయినుద్దౌలా గోల్డ్ కప్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సహకరించాలని జగన్ మోహన్ రావు కోరగా, బీసీసీఐ ఆ విజ్ఞప్తిని స్వాగతించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో టీపీఎల్ నిర్వహణకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హెచ్‌సీఏ ప్రెసిండెంట్ కోరగా.. అందుకు బీసీసీఐ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.