హైదరాబాద్, వెలుగు: విద్యారంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని టీపీటీఎఫ్ స్టేట్ ఆఫీసులో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రుల కమిటీని వేసినా.. ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
టీచర్లు తమ అవసరాల కోసం పెట్టుకున్న జీపీఎఫ్, జీఐఎస్ లోన్లు, సరెండర్ లీవ్స్ తదితర బిల్లులు ఏడాది నుంచి పెండింగ్ లోఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ... తుక్కుగూడ హెడ్మాస్టర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు.