- చరిత్ర పరిశోధకుడు ఆర్. రత్నాకర్ రెడ్డి
హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లిలోని దేవగిరిగుట్టపైన ఆదిమానవుల ఆనవాళ్లు గుర్తించామని చరిత్ర పరిశోధకుడు, డిస్కవరిమెన్ ఆర్. రత్నాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో చరిత్ర ఆధారాలను అన్వేషించే క్రమంలో మంగళవారం ప్రతాప్, ఓంకార్ లతో కలిసి ఆయన పరిశీలించిన అనంతరం వివరాలు వెల్లడించారు. దేవగిరి గుట్టపైన శివలింగం ఉన్న గుహ ముందు భాగంలో పడగరాయి బయటకు పొడుచుకు వచ్చిందని, ఇలాంటి సంస్కృతి ఆది మానవుల యుగాల్లో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. 5 వేల ఏండ్ల కిందే నవీన శిలాయుగానికి చెందిన ఆదిమానవులు ఈ గుట్టని కేంద్రంగా చేసుకొని జీవించార న్నారు. గుట్టపైన రాతి పనిముట్లను తయారు చేసుకోగా ఏర్పడిన గుంతలు ఉన్నాయన్నారు. నవీన, బృహత్ శిలాయుగాల్లోని ఆది మానవులకు దేవగిరి గుట్టతో పాటు సమీపంలోని గుట్టల్లో కూడా ఆవాసాలను గుర్తించామని తెలిపారు.