ట్రాక్టర్ల డబ్బాలు మాయం చేసి.. వాట్సప్‌‌లో అమ్మేస్తరు

హైదరాబాద్‌‌, వెలుగు: రైతుల ట్రాక్టర్ల ట్రాలీలను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వ్యవసాయ బావుల వద్ద పార్క్ చేసిన ట్రాలీలను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ మాడుగుల  పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షలు విలువ చేసే 13 ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌‌‌‌బాబు శనివారం వెల్లడించారు. 

బావుల వద్ద రెక్కీ నిర్వహిస్తూ..

నల్లగొండ జిల్లా మరెపల్లి గ్రామానికి చెందిన సంపంగి మహేశ్(24) కూలి పనులు చేస్తుంటాడు.ఈజీ మనీ కోసం చోరీలకు ప్లాన్ చేశాడు. కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన తన బంధువు  ఒర్సు వెంకన్న(27)తో కలిసి ట్రాక్టర్‌‌‌‌ల ట్రాలీలను చోరీలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇద్దరూ రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద రెక్కీ నిర్వహించేవారు. పార్కింగ్ చేసిన ట్రాక్టర్ ట్రాలీని గుర్తించి..రాత్రి వేళలో ట్రాక్టర్ ఇంజిన్‌‌తో పొలానికి వెళ్లేవారు. వాళ్ల ట్రాక్టర్ ఇంజిన్‌‌తో ట్రాలీని తగిలించుకుని పరార్ అయ్యేవారు. ఇలా దొంగిలించిన ట్రాలీలను తక్కువ ధరకు సెకండ్‌‌ హ్యాండ్ లో అమ్మేవారు. 

ఇలా బయటపడింది..

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొల్కులపల్లికి చెందిన రైతు కొప్పుల చెన్నయ్య తన పొలంలో ట్రాక్టర్‌‌‌‌తో పనులు చేస్తుండేవాడు.ప్రతి రోజు ట్రాక్టర్ ట్రాలీని బావి వద్ద పార్క్‌‌ చేసి ఇంజిన్ తీసుకెళ్తుండేవాడు.ఈ క్రమంలో గత నెల 30న కూడా సాయంత్రం 7 గంటల సమయంలో ట్రాలీని పార్క్‌‌ చేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి ట్రాలీ కనిపించలేదు.చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో  బాధిత రైతు చెన్నయ్య ఈ నెల 6న మాడుగుల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రైతు ఫిర్యాదుతో వెలుగులోకి..

చెన్నయ్య ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత నెలలోనే ఇబ్రహింపట్నంలోనూ ట్రాలీ చోరీ కేసు నమోదు అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే గత  ఐదు నెలల వ్యవధిలో అడ్డగూడురు, మోత్కురు, ఆత్మకూరు, పోచంపల్లి, వలిగొండ, దేవరకొండ, చందంపేట,కల్వకుర్తి పీఎస్‌‌ల పరిధిలో 11 ట్రాలీలు చోరీ అయినట్లు నిర్ధారించారు.

ఇలా కొట్టేసిన ట్రాలీలను నల్లగొండకు చెందిన రీ సేల్‌‌ అనే వాట్సప్‌‌ గ్రూపులో  పెట్టి మీడియేటర్ల ద్వార విక్రయిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. మాడుగుల ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌ టీమ్‌‌ వాట్సప్‌‌ గ్రూప్‌‌లో  డెకాయ్ ఆపరేషన్ చేసింది. ట్రాలీలు కొంటామని చెప్పి నిందితులు మహేశ్, వెంకన్నలను చాకచక్యంగా  అరెస్ట్ చేసింది.