జీహెచ్​ఎంసీలో ట్రేడ్​ లైసెన్స్ దందా

జీహెచ్​ఎంసీలో  ట్రేడ్​ లైసెన్స్ దందా
  •  ఫీజులు వసూలు చేసి జేబుల్లో వేసుకుంటున్న సిబ్బంది
  •  జీహెచ్​ఎంసీకి కడితే ఏమొస్తుందని వ్యాపారస్తులకు హితబోధ
  • లైసెన్సులు ఇప్పిస్తామంటూ దోపిడీ
  • లెక్క ప్రకారం రూ.500 కోట్లకు పైనే రావాలె  
  • ఈ ఏడాది వచ్చింది రూ. 92.45 కోట్లే 

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియాలో ఇంటి దొంగలు ఖజానాకు గండి కొడుతున్నారు. వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజు కలెక్ట్​చేయకుండా మామూళ్లు తీసుకొని వదిలేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లిస్తే ఆన్ లైన్ లో కనిపిస్తుంది. చెల్లించకపోతే వచ్చే ఏడాది కట్టాల్సి ఉంటుంది. కానీ, ట్రేడ్ లైసెన్స్​ ఏ ఏడాదికి ఆ ఏడాదే ఉండడంతో ఏండ్లుగా బిజినెస్ ​చేస్తున్నవారికి కూడా ఒక్క ఏడాది ఫీజుతోనే సరిపెడుతున్నారు. 

ట్రేడ్ లైసెన్స్​ఫీజుల వసూళ్ల బాధ్యత, పర్యవేక్షణ సర్కిల్ అసిస్టెంట్, మెడికల్ ఆఫీసర్ హెల్త్(ఏఎంఓహెచ్) లకు అప్పగించడంతో వారు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు సాగుతోంది. కొందరు మెడికల్ ఆఫీసర్లు ట్రేడ్ లైసెన్స్ ఫీజులకు బదులు తమకు మామూళ్లు ఇవ్వాలని సిబ్బందికి టార్గెట్లు​పెట్టడంతో వారు వసూళ్లకు దిగి తమకింత, బాస్​కు ఇంత అని లెక్కలు వేసి పంచుకుంటున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సిన వారి నుంచి వేలల్లో లంచాలు తీసుకుంటున్నారు.  

ఇలా ‘సెటిల్’​ చేస్తారు ..

20 ఫీట్ల మేర సింగిల్ లేన్ రోడ్డు ఉంటే చదరపు మీటర్ కు రూ.3, డబుల్ లేన్ రోడ్డు ఉంటే 20 నుంచి 30 ఫీట్ల మేర ఉన్న రోడ్లపై చదరపు ఫీట్ కు రూ.4, రెండు లేన్ల కంటే ఎక్కువగా ఉండి 30 ఫీట్లకు మించిన రోడ్లపై చదరపు మీటర్ కు రూ.6  ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రీనరీ చార్జీలు కూడా కట్టాలి. సంబంధిత వ్యాపారి డైరెక్ట్​ఆన్ లైన్ లో ఈ ఫీజు కట్టుకోవచ్చు. కానీ,సర్కిల్ లో ఎస్ఎఫ్ఏలు వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. లైసెన్స్​ఉన్నవాళ్లయితే ఎంత ఫీజు కట్టాలో చెప్పి అనవసరంగా బల్దియా​కు పోతే ఏమొస్తుందని, తమకే ఎంతో కొంత ఇస్తే సెటిల్​చేస్తామని చెప్తున్నారు. ఉదాహరణకు రూ. లక్ష ఇచ్చేవారి దగ్గర రూ. 50 వేల వరకు తీసుకుని వదిలేస్తున్నారు. తర్వాత షాప్​క్లోజ్​అయ్యిందనో.. మరో కారణం చెప్పి ఆ ఏడాది ఫీజు సర్కారుకు రాకుండా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంకో రకం దోపిడీకి దిగుతున్నారు. 

మరికొన్ని చోట్ల వ్యాపారుల దగ్గరకు వెళ్లి చదరపు ఫీట్ కు రూ. 9 ఉందని చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఆన్ లైన్ లో రూ.6 కడుతున్నారు. ఇటీవల మహాప్రస్థానంలోని ఓ వ్యాపారి వద్దకు ఇద్దరు ఎస్ఎఫ్ఏలు వెళ్లి ఇదేతరహాలో చదరపు ఫీట్ కు రూ.9 చెల్లించాలని డిమాండ్ చేశారు. సదరు షాపు యజమానికి అంతే ఫీజు కావచ్చని వారికి ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. కానీ, చివరలో ఎందుకో అనుమానం వచ్చి పై అధికారితో మాట్లాడాడు. ఆయన అంత లేదని చెప్పడంతో వారికి నేరుగా ఇవ్వకుండా ఆన్​లైన్​లో కట్టుకున్నాడు.  

లైసెన్సులు ఇప్పిస్తామని..

ట్రేడ్ లైసెన్సుల వసూళ్లతో పాటు లైసెన్సులు ఇప్పిస్తామని కూడా దందా చేస్తున్నారు. ముందుగా షాపుకు వెళ్లే సిబ్బంది లైసెన్స్​ఉందా లేదా అన్నది వెరిఫై చేస్తారు. లైసెన్స్​ఉంటే సెటిల్​చేసుకోవడం, లేకపోతే తీసుకోవాల్సిందేనని, వినకపోతే షాపు సీజ్​చేస్తామని బెదిరించి డబుల్​ఎమౌంట్​తీసుకుంటున్నారు. ఇలాగే ఇటీవల కొందరు ఎస్ఎఫ్ఏలు ఏసీబీకి చిక్కారు. 

జూబ్లీహిల్స్ లో ఇద్దరు ఎస్ఎఫ్ఏ లు ఓ వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఇప్పిస్తానని నమ్మబలికారు. రూ. 10 వేలు అయ్యే దగ్గర రూ.60 వేలు ఇవ్వాలని అడిగారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న సదరు వ్యాపారి ఏసీబీకి చెప్పి పట్టించాడు. ఈ విషయం కమిషనర్​దగ్గరకు చేరడంతో ఆయన మెడికల్ ఆఫీసర్ కి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అన్ని సర్కిల్స్​లో ఇలాగే జరుగుతోందని తెలుసుకున్న కమిషనర్ ​ఇలంబరితి ఇంటర్నల్​ విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.  

అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ ఆఫీసర్లు

బల్దియాలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు.. డైరెక్టర్ ​ఆఫ్ హెల్త్ నుంచి డిప్యూటేషన్​పై వచ్చి పనిచేస్తున్నారు. కొందరు ఏండ్లుగా ఇక్కడే పాతుకుపోవడంతో వారి అక్రమాలకు కూడా అడ్డూ అదుపు లేకుండా పోతోంది.  బల్దియా బదిలీల్లో భాగంగా ఇటీవల మెడికల్ ఆఫీసర్ల ట్రాన్స్​ఫర్లు కూడా జరిగాయి. అయితే, ఓ మెడికల్​ఆఫీసర్ బదిలీ అయిన సర్కిల్ నుంచి ఇప్పటికీ మామూళ్లు తీసుకుంటున్నాడు. మరికొందరు  మెడికల్ ఆఫీసర్లు తెలివిగా తమ పేరు బయటకు రాకుండా కింది స్థాయి సిబ్బందితోనే అంతా చేయిస్తున్నారు. దొరికితే కింది స్థాయి సిబ్బందే బలవుతున్నారు.

ఎప్పుడూ రూ. 100 కోట్లు కూడా రాలే

చిన్న, పెద్ద వ్యాపారాలు కలిపి సిటీలో దాదాపు10 లక్షలకు పైగానే ఉన్నాయి. ఇందులో 2.6 లక్షల కమర్షియల్ భవనాలున్నా కనీసం 2 లక్షల ట్రేడ్ లైసెన్సులు కూడా జారీ కావడం లేదు. కొన్ని చోట్ల ఒక్క కమర్షియల్ బిల్డింగ్ లో 5 నుంచి 10 వరకు వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఈ లెక్కన  ట్రేడ్ లైసెన్స్ ఫీజు కలెక్ట్ చేస్తే రూ.500 కోట్లకు మించి ఆదాయం రావాలి. 

కానీ జీహెచ్ఎంసీ వీటిలో కేవలం 10 శాతం మంది నుంచి మాత్రమే ఫీజులు కలెక్ట్ ​చేస్తోంది. ఈ ఏడాది 1,07,800 లైసెన్సు దారులున్నారని చెప్తూ బల్దియా 92.45 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీన్ని బట్టి అక్రమాలు ఏ మేరకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్ ఇలా..

ఏడాది        ట్రేడ్ లైసెన్సులు     ఆదాయం రూ.కోట్లలో


2018–19        40,422                               32.91
2019–20        39,501                               34,47
2020–21        31,166                               32.63
2021–22        34,813                               46.37 (మార్చి నుంచి డిసెంబర్)
2022              74,561                               72.15 
2023            1,06,333                              81.92 
2024            1,07,800                              92.45(జనవరి నుంచి డిసెంబర్​ 1 వ తేది వరకు)