శాంతిఖని-2 ఓసీపీని రద్దు చేయాలి.. జేఏసీ నేతలు డిమాండ్

బెల్లంపల్లి, వెలుగు: సింగరేణి సంస్థ ప్రారంభించ తలపెట్టిన శాంతిఖని-2 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును రద్దు చేసి, అదే ప్రాంతంలో భూగర్భ గనిని పునఃప్రారంభించాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బెల్లంపల్లి పట్టణం లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ.చాంద్ పాషా, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.మణిరాంసింగ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీరటి రాజన్న, ఎస్‌జీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి అంబాల మహేందర్, మాజీ జడ్పీటీసీ కార్కూరి రాంచందర్ తదితరులు మాట్లాడారు.

లాభాల కోసం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు ప్రారంభించి ప్రకృతిని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రజలను కూడగట్టి సింగరేణి సంస్థపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బెల్లంపల్లి ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, అక్కడ ప్రతిపాదించిన బెల్లంపల్లి షాఫ్ట్ బ్లాక్-1, 2, 3, 4 భూగర్భ గనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా వేలాది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తా యని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్, ఐఎఫ్టీయూ, బీఆర్ఎస్, హెచ్ ఎంఎస్, సీపీఐ ఎంఎల్ రెడ్ స్టార్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పాల్గొన్నారు.