- ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జర్మినేషన్ ఫెయిల్డ్ సీడ్స్
- భారీ మొత్తంలో రైతులకు అంటగడ్తున్న వ్యాపారులు
- మే నెలలో చల్లేందుకు కొని స్టాక్ పెట్టుకుంటున్న రైతులు
మహబూబ్‌నగర్, వెలుగు: రాష్ట్రంలోకి నిషేధిత బీటీ- –3, జర్మినేషన్ టెస్టులో ఫెయిల్ అయిన పత్తి విత్తనాలు వస్తున్నాయి ప్రధానంగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్రాష్ర్టాల నుంచి బీటీ-–3, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఫెయిల్యూర్ సీడ్స్‌ను తెప్పిస్తున్న వ్యాపారులు, సీడ్ ఆర్గనైజర్లు రైతులకు అంటగడుతూ మోసగిస్తున్నారు. మే నెల చివరి వారం నుంచి పత్తి విత్తనాలు చల్లుకునే టైం మొదలు కానుండడంతో, గ్రామాల్లో ఇప్పటికే ఈ విత్తనాలను కొని రైతులు స్టాక్ పెట్టుకున్నారు. ఒకవేళ ఈ విత్తనాలను వాడితే భారీ ఎత్తున నష్టపోయే అవకాశాలుంటాయి.
మూడు జోన్లుగా డివైడ్ చేసి బిజినెస్
రాష్ట్రంలో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట పత్తి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50,59,225 ఎకరాలు కాగా, గత వానాకాలంలో 44,77,937 ఎకరాల్లో సాగు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా అత్యధికంగా ఆదిలాబాద్‌లో 10.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, నల్లగొండలో 7.57 లక్షలు, మహబూబ్‌నగర్‌లో 6.67 లక్షలు, వరంగల్‌లో 5.26 లక్షలు, మెదక్‌లో 5.04 లక్షలు, ఖమ్మంలో 3.83 లక్షలు, రంగారెడ్డిలో 3.89 లక్షలు, కరీంనగర్లో 1.72 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. అయితే విత్తన వ్యాపారులు, సీడ్‌ఆర్గనైజర్లు పత్తి సాగవుతున్న ఏరియాలను జోన్లుగా విభజించి ఈ ప్రాంతాల్లోని మార్కెట్లలోకి బీటీ–-3, ఫెయిల్యూర్ సీడ్స్‌ను పంపించి రైతులకు అంటగడుతున్నారు.
మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాలను ఒక జోన్‌గా, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్జిల్లాలను మరో జోన్‌గా.. ఖమ్మం, నిజామాబాద్జిల్లాలను ఇంకో జోన్‌గా ఏర్పాటు చేసుకొని ఏజెంట్ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ప్రాంతాలకు బీటీ-–3 విత్తనాలను కర్ణాటకలోని గుర్మిట్కల్, రాయచూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, నంద్యాల ప్రాంతాల నుంచి తెప్పించుకొని రైతులకు చేరవేస్తున్నారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూల్, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొని అమ్ముతున్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం సర్టిఫై చేసిన మేలు పత్తి విత్తనాల ప్యాకెట్ (450 గ్రామాలు) ఒకటి రూ.740 నుంచి రూ.860 వరకు దొరుకుతుండగా, నిషేధిత బీటీ–-3 కిలో విత్తనాలను డిమాండ్‌ను బట్టి వ్యాపారులు రూ.1,300 నుంచి రూ.1,500 వరకు
అమ్ముతున్నారు.
నడిగడ్డ కేంద్రంగా ఫెయిల్యూర్ సీడ్ దందా
పత్తి విత్తన కంపెనీలు, రైతులకు మీడియేటర్లుగా ఉన్న సీడ్ ఆర్గనైజర్లు నడిగడ్డ కేంద్రంగా ఫెయిల్యూర్ సీడ్స్ దందా నిర్వహిస్తున్నారు. కంపెనీలు తయారు చేసిన విత్తనాలను సీడ్ ఆర్గనైజర్లకు అందజేస్తుండగా..వారు ఈ విత్తనాలను సాగు కోసం రైతులకు ఇస్తున్నారు. రైతులు సాగు చేసిన ఈ విత్తనాలను ఆర్గనైజర్లు తిరిగి సేకరించి..ఆయా కంపెనీలకు అందజేస్తారు. ఈ విత్తన శాంపిల్స్‌కు కంపెనీలు జర్మినేషన్ టెస్ట్ నిర్వహిస్తాయి. మొలక శాతం తగినంత లేని వాటిని ఫెయిల్యూర్ విత్తనాలుగా గుర్తించి తిరిగి ఆర్గనైజర్లకు ఇస్తాయి.
ఈ విత్తనాలను ఆర్గనైజర్లు రైతులకు ఇస్తే వారు పగలగొడతారు. ఇక్కడే సీడ్‌ఆర్గనైజర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫెయిల్యూర్ సీడ్స్‌ను రైతులకు ఇవ్వకుండా నేరుగా గద్వాల, భూత్పూర్, హైదరాబాద్ శివార్లలోని పత్తి విత్తన శుద్ధి కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కంపెనీల స్టిక్కర్లు ముద్రించిన ప్యాకెట్లలో సీడ్స్‌ను నింపి బహిరంగ మార్కెట్లలోకి పంపుతున్నారు. కర్ణాటక, ఏపీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ సర్టిఫైడ్ విత్తనాలకంటే చాలా చౌకగా ఈ విత్తనాలను అమ్ముతున్నారు. 450 గ్రాముల విత్తనాల ప్యాకెట్ఒకదానికి ఏరియాను బట్టి రూ.450 నుంచి రూ.550 వరకు అమ్ముతున్నారు.
ఇప్పటికే 60 శాతం ఫెయిల్యూర్ సీడ్స్ కొన్న రైతులు
టాస్క్‌ఫోర్స్ దాడుల భయంతో వ్యాపారులు, సీడ్ ఆర్గనైజర్లు బీటీ-3, ఫెయిల్యూర్ సీడ్స్‌ను ఫిబ్రవరి నెల నుంచే మార్కెట్లలోకి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 60 శాతం విత్తనాలను రైతులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఈ సీజన్లో మే చివరి వారం నుంచి తొలకరి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు ముందుగానే విత్తనాలను కొని గ్రామాల్లో స్టాక్ చేసి పెట్టుకున్నట్టు తెలిసింది.