మిర్చికి రేటు పెట్టరు.. దాచుకోనియ్యరు

వరంగల్‍ , ఖమ్మం మిర్చి మార్కెట్లలో వ్యాపారులు, ఆడ్తిదారులు ఒక్కటై రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మిర్చి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్‍ లేదని చెప్తూ గడిచిన రెండు నెలలుగా రేటు తగ్గిస్తున్నారు. కనీసం పంటను కొన్ని నెలలపాటు దాచుకుందామని వెళ్తున్న రైతులకు కోల్డ్ స్టోరేజీలు కూడా దొరకనివ్వకుండా బ్లాక్​ చేస్తున్నారు. మార్కెట్లలో ఉదయం పెట్టే జెండా పాటకు.. రైతులకు కట్టించే ధరకు ఏకంగా రూ.10 వేల తేడా ఉంటోంది.  ఉదాహరణకు.. చపాట రకాని (దొడ్డు మిర్చి)కి ఎనుమాముల మార్కెట్లో సగటున రూ.27వేల నుంచి రూ. 28 వేల జెండా పాట పెడుతున్నారు. తీరా అడ్తిదారులు రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో క్వాలిటీ లేదనే సాకుతో క్వింటాల్‍ చపాట మిర్చికి కేవలం రూ.14  వేల నుంచి రూ.15 వేలు మాత్రమే కట్టిస్తున్నారు.

ఇదే చపాట రకానికి నాగ్​పూర్​ మార్కెట్​లో రూ.26 వేలు పెడ్తున్నారని తెలిసిన ఇక్కడి రైతులు.. కొద్దిరోజులుగా పంట అమ్ముకునేందుకు అక్కడిదాకా వెళ్లడాన్ని బట్టి ఇక్కడి మన వ్యాపారుల దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఆయా మార్కెట్లలో రైతులు ఆందోళనకు దిగుతున్నా న్యాయం జరగడం లేదు.  గత నెలలో ఖమ్మం మార్కెట్​లో రూ.19 వేలు జెండా పాటగా నిర్ణయించి, 13 వేలకు కొనడాన్ని  తట్టుకోలేక పలువురు రైతులు ఖమ్మం మార్కెట్ యార్డులో బైఠాయించారు. మూడు నాలుగు గంటల ఆందోళన తర్వాత అధికారులు, వ్యాపారులతో చర్చలు జరిపి మళ్లీ కొనుగోళ్లు జరిపించారు. ఇది జరిగి రెండు రోజులు గడవకముందే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.

ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల 

పల్లి రైతులు ప్రతిసారి ట్రేడర్లు, కమీషన్​ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. మన రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్​జిల్లాల్లో పల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉమ్మడి పాలమూరులో గత వానకాలం 3.80 లక్షల ఎకరాల్లో పల్లి సాగైంది. డిసెంబరు చివరి వారం నుంచి పంట మార్కెట్​కు రాగా,  మొదట ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ రూ.6,377 కంటే ఎక్కువ  రూ.8,300 నుంచి రూ.9,200 వరకు చెల్లించారు.  మార్కెట్​లోకి పల్లి రావడం పెరగ్గానే వ్యూహం ప్రకారం ధర తగ్గించారు. జనవరి రెండో వారం తర్వాత  రేట్లు డౌన్ చేస్తూ వచ్చారు. రోజూ క్వింటాల్​కు రూ.100 నుంచి రూ.300 వరకు తగ్గిస్తూ ఫైనల్​గా మేలు రకం పల్లికి రూ.5 వేల కు తెచ్చి రైతులను మోసం చేశారు.  దీనికితోడు పంటను మార్కెట్​కు తెస్తే అన్ని ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. కాంటాల సమయంలో హమాలీలు, చాట కూలీలకు కలిపి రూ.2 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. వేరుశనగను కుప్పలుగా పోసినందుకు ఆ స్థానానికి అద్దె కింద కుప్పకు రూ.250 నుంచి రూ.300 వరకు మార్కెట్​కు కడుతున్నారు. కాంటా జోకేటోళ్లకు సంచికి రూ.5, ట్రేడర్ల నుంచి గోనె సంచులను తీసుకున్నందుకు ఒకదానికి అద్దె కింద రూ.6  కడుతున్నారు. ఇవి కాకుండా కమీషన్ ఏజెంట్​కు నూటికి రూ.5 చొప్పున చెల్లిస్తున్నారు.  

Also Read: మామిడి ధర రూ.40వేలకు డమాల్