
- రెండు విడతల్లో 70 యూనిట్లకే టెండర్లు ఖరారు
- 19న మూడో విడత టెండర్ కాల్
మహబూబాబాద్, వెలుగు: తునికాకు సేకరణ ధర పెంపుతో కూలీలు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కాంట్రాక్టర్లు మాత్రం తమపై భారం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. ఏజెన్సీ ఏరియాలోని ప్రజలు ఎండాకాలంలో తునికాకు సేకరణతోనే ఉపాధి పొందుతుంటారు. ఇప్పటివరకు 50 ఆకుల కట్టకు రూ. 2.50 చెల్లించే|వారు. ఈ సంవత్సరం నుంచి కట్టకు రూ. 3 చెల్లించాలని నిర్ణయించారు. ధర పెంపుతో పాటు, వివిధ రకాల ట్యాక్స్‌లు కట్టాల్సి వస్తుండడంతో కాంట్రాక్టర్లు నారాజ్ అవుతున్నారు.
70 చోట్లే టెండర్లు
తునికాకు సేకరణకు రాష్ట్రంలో 225 యూనిట్లు ఉన్నాయి. ఇందులో కాళేశ్వరం డివిజన్‌లో 73, మంచిర్యాలలో 47, బాసరలో 13, రాజన్న సిరిసిల్లలో 16, భద్రాద్రి కొత్తగూడెంలో 57, చార్మినార్‌లో 19 యూనిట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల చివర్లలోనే టెండర్లు పూర్తి కావాలి. కానీ ఆన్‌లైన్ టెండర్లలో తక్కువ మొత్తం కోట్ చేయడంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ధర పెంపుతో నారాజ్‌లో ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు కేవలం 70 చోట్ల మాత్రమే టెండర్లను ఖరారు అయ్యాయి. ఈ నెల 19న మూడో విడత టెండర్లు పిలిచేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంట్రాక్టర్లపై ఆర్థిక భారం
తునికాకు సేకరణకు కాంట్రాక్టర్లు గతంలో 4 శాతం వ్యాట్, ఫారెస్ట్ రాయల్టీ మాత్రమే చెల్లించేవారు. ఇప్పటినుంచి 18 శాతం జీఎస్టీ, 5 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్, ఫారెస్ట్రాయల్టీతో పాటు, కూలీలకు కట్టకు రూ.3 చెల్లించాలని నిర్ణయించారు. దీంతో కాంట్రాక్టర్లు గతంలో మాదిరిగా టెండర్ కోట్ చేయలేకపోతున్నారు. వీటికి తోడు అడవిలో చందాల వసూలు, ఫారెస్ట్ మామూళ్లతో పాటు ఇతర ఖర్చులు భారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది తునికి ఆకు కేజీ రూ.160కే అమ్ముడుపోవడంతో నష్టపోవాల్సి వచ్చిందని అంటున్నారు.
భారం తగ్గించాలి
తునికి ఆకు సేకరణ రేటు పెంపు, జీఎస్టీ, రాయల్టీ చెల్లించడం వల్ల కాంట్రాక్టర్లకు ఏమీ మిగలదు. ప్రభుత్వం స్పందించి ట్యాక్స్‌ల భారం తగ్గించాలి. ప్రభుత్వ నిర్ణయం కారణం గానే కాంట్రాక్టర్లు ఎక్కువ మొత్తంలో టెండర్ కోట్ చేయలేకపోతున్నారు. అలాగే ఫారెస్ట్ ఆఫీసర్లు తునికాకు ప్రూనింగ్‌కు అనుమతించకపోవడంతో నాణ్యమైన ఆకు దొరకడం లేదు.
- కారోజు రమేశ్, తునికి ఆకు కాంట్రాక్టర్