- మార్కెట్ ఫీజుకు మంగళం
- కోట్లలో వ్యాపారం.. లక్షల్లో ఆదాయం
- వ్యాపారులతో అధికారులు కుమ్మక్కు
- ఏటా సాగుతున్న అక్రమ భాగోతం
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మామిడి మార్కెట్ యార్డులో వ్యాపారులు గోల్ మాల్ చేస్తున్నారు. ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపడుతుండగా, మరోవైపు మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆదాయానికి గండిపడుతోంది. మామిడి మార్కెట్ యార్డులో కోట్లల్లో వ్యాపారం సాగుతున్నా మార్కెటింగ్ శాఖకు మాత్రం రూ.20 లక్షల ఆదాయం కూడా రావడం లేదు. మామిడి వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై వ్యవసాయ మార్కెట్‌కు ఆదాయం రాకుండా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వ్యాపారులు నిర్వహించిన కొనుగోళ్లలో మార్కెట్ కమిటీకి ఒక్క శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ మార్కెట్ ఫీజు మాత్రం అంతంత మాత్రంగానే చెల్లిస్తున్నారు. దీంతో మార్కెట్‌కు తగిన ఆదాయం రావడం లేదు. కొన్నేండ్లుగా సూర్యాపేట మామిడి మార్కెట్ యార్డుకు ఏటా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు మాత్రమే ఆదాయం వస్తోంది.
రూ.200 కోట్ల వ్యాపారం..
సూర్యాపేట– జనగామ రోడ్ వద్ద నిర్వహిస్తున్న మామిడి మార్కెట్‌లో ప్రతి సీజన్‌లో దాదాపు రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. ఏటా సుమారు 5 వేల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, చండీఘడ్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు లారీల్లో మామిడి కాయలు తరలిస్తుంటారు. ప్రతిరోజూ 20 నుంచి 30 లారీల్లో మామిడి కాయలు వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. పెద్ద లారీల్లో సుమారు 12 నుంచి 15 టన్నుల మామిడి కాయలు పడుతాయి. గత నాలుగైదేళ్లుగా సగటున టన్నుకు రూ. 30 వేల వరకు ధర పలికింది. టన్నుకు రూ.30 వేల చొప్పున 15 టన్నులకు రూ.4.50 లక్షలు అవుతోంది. ఒక్క శాతం ఫీజు కింద ఒక్కో లారీకి రూ.4,500 చెల్లించాలి. ప్రతిరోజూ 30 లారీల్లో మామిడి కాయలు తరలితే సుమారు రూ.1.62 లక్షలు మార్కెట్‌కు ఆదాయం రావాల్సి ఉంది. దాదాపుగా నాలుగు నెలలపాటు మామిడి మార్కెట్ కొనసాగుతోంది. ఈ లెక్కన రూ.కోటిన్నరకు పైగా మార్కెట్‌కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు అధిక రేటుకు మామిడి కాయలు కొనుగోలు చేసినప్పటికీ తక్కువ రేటుకు కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపి తక్కువ ఫీజు
కడుతున్నారు.
రూ.కోట్లలో వ్యాపారం..
సూర్యాపేట మామిడి మార్కెట్‌కు 2022 సీజన్‌లో రూ.22.51 లక్షలు ఫీజు వసూల్ అయింది. 2023లో రూ.19.84 లక్షలు, 2024లో రూ.3.39 లక్షలు మాత్రమే మార్కెట్ ఫీజు వసూల్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్ లైసెన్స్ తీసుకోవడానికి, నిర్ణీత ఫీజు చెల్లించడానికి వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సూర్యాపేట మార్కెట్ లో 17 మంది వ్యాపారులకే లైసెన్సులు ఉండగా, మరో ముగ్గురు వ్యాపారస్తులు లైసెన్స్ లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ ఫీజు ఎగవేయడానికే వ్యాపారులు ఎత్తులు వేస్తున్నారని, అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.