వనపర్తి జిల్లాలో మున్సిపాలిటీల్లో ట్రేడ్​ లైసెన్స్ లు తీసుకోవట్లే

వనపర్తి జిల్లాలో మున్సిపాలిటీల్లో ట్రేడ్​ లైసెన్స్ లు తీసుకోవట్లే
  • లైసన్స్​లు తీసుకున్నవారు ట్యాక్స్​ కట్టట్లే
  • మున్సిపల్​ ఆదాయానికి భారీగా గండి

వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో వ్యాపారులు ట్రేడ్​ లైసెన్సులు తీసుకోవడం లేదు. తీసుకున్నా వాటిని రెన్యువల్​ చేయించుకోకపోవడం, ట్యాక్స్​ కట్టకపోవడంతో మున్సిపాలిటీల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇంటి, నల్లా పన్నుతో​పాటు ట్రేడ్​ లైసెన్స్​ ట్యాక్స్​తో మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతోంది. అయితే రాజకీయ అండదండలు ఉన్న వ్యాపారులు లైసెన్స్​లు తీసుకోకుండా, ట్యాక్స్​ చెల్లించకుండా ఎగవేస్తున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మున్సిపల్​ సిబ్బంది​ట్యాక్స్​ వసూలు చేస్తుంటారు. అయితే వంద శాతం పన్ను వసూలు కాకపోవడంతో మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉంది.

50 శాతం మేరకే వసూళ్లు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కువ మున్సిపాలిటీలున్నది వనపర్తి జిల్లాలోనే. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో 50 శాతానికి పైగా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు ట్రేడ్​ లైసెన్స్​ ట్యాక్స్​ చెల్లించడంలేదు. అలా ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 3,200 వరకు దుకాణాలు, ఇతర సంస్థలు ట్రేడ్​ లైసెన్స్​ ట్యాక్స్​ చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసుతో చాలా మంది లైసెన్స్​ ఫీజు చెల్లించడం లేదు.

 ఏటా రెన్యూవల్  చేయించుకోవాల్సి ఉన్నా దాటవేస్తున్నారు. బ్యాంక్​ నుంచి లోన్​ తీసుకోవాలనుకునేవారు మాత్రమే మున్సిపాలిటీ నుంచి ట్రేడ్​ లైసెన్స్​ పొంది లైసెన్స్​ ఫీజు చెల్లిస్తున్నారు. పెబ్బేరు రోడ్డులోని ఓ కిరాణ దుకాణం కాంప్లెక్స్​ ఓనర్​ లైసెన్స్​ తీసుకోనంటూ ఏకంగా మున్సిపల్​ సిబ్బందినే తిప్పి పంపించారు.

ట్రేడ్​ లైసెన్స్​ ఫీజు ఎంతంటే?

ఒక దుకాణం, వ్యాపార సంస్థను నడిపే యజమాని ఏయే ప్రాంతంలో ఎంత ట్రేడ్​ లైసెన్స్​ ఫీజు చెల్లించాలన్నది నిర్ణయించారు. వ్యాపారి కిరాయి దుకాణంలో ఉన్నా లైసెన్స్​తో యజమానికి సంబంధం లేదు. షాపు ఎదురుగా 20 ఫీట్ల రోడ్డున్న వారు ఒక ఫీటుకు రూ.3 చొప్పున, 30 ఫీట్ల రోడ్డుంటే రూ.5 చొప్పున అదే 30 ఫీట్లకు పైగా రెండు వరుసల రోడ్డు ఉంటే ఫీట్​కు రూ.7 చొప్పున ట్రేడ్​ లైసెన్స్​ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

వనపర్తిలోనే ఎక్కువ దుకాణాలు..

వనపర్తి జిల్లా హెడ్​ క్వార్టర్​ కావడంతో మూడేండ్లుగా కొత్త దుకాణాలు, షాపింగ్​ మాల్స్, ఇతర షాప్​లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోనే 3,400 దాకా షాపులు ఉన్నాయి. కొత్తకోటలో 810, పెబ్బేరులో 750, ఆత్మకూరులో 518, అమరచింతలో 102 దుకాణాలు ఉన్నట్లు మున్సిపాలిటీ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఒక్క పెబ్బేరు, కొత్తకోటల్లో మినహా ఏ మున్సిపాలిటీలోనూ 50 శాతం కూడా లైసెన్స్​ ఫీజు వసూలు కాలేదు.

ట్యాక్స్​ వసూళ్లపై ఫోకస్..

వనపర్తి కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఇటీవల మున్సిపల్​ అధికారులతో మీటింగ్​ పెట్టి మున్సిపాలిటీకి వచ్చే అన్ని రకాల పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. పన్ను వసూళ్లు ఎందుకు కావడం లేదనే విషయాన్ని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. వంద శాతం పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. పన్ను వసూళ్లపై దృష్టి పెట్టాలని మున్సిపల్​ కమిషనర్లకు 
సూచించారు.