ఖమ్మం, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్ల హవా నడుస్తోంది. మిర్చికి మద్దతు ధరలు ప్రకటించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కమీషన్ఏజెంట్లతో కలిసి వాళ్లనుకున్నదే రేటుగా నిర్ణయిస్తున్నారు. 3 నెలల క్రితం మిర్చి క్వింటాలు ధర రూ.20 వేలు ధర ఉండగా, ప్రస్తుతం రూ.14 వేలకు పడిపోయింది. జెండా పాట రేటు రోజుకు ఒకరిద్దరికి మాత్రమే దక్కుతోంది. ధర నచ్చకపోతే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుని రైతు బంధు కింద లోను తీసుకోవచ్చని తెలియక చాలా మంది రైతులు నష్టపోతున్నారు.
ఆర్డర్లు తగ్గాయ్.. ఏం చేయలేం
ఖమ్మం మార్కెట్కు బుధవారం15,900 బస్తాల మిర్చి వచ్చింది. జెండా పాటను ట్రేడర్లు రూ.14 వేలుగా, కనీస ధర రూ.8 వేలుగా నిర్ణయించి కొన్నారు. గతవారం రూ.16 వేలు ఉండగా సోమవారం గరిష్ఠ ధర14,600 ఉంది. మంగళవారం క్వింటాకు రూ.600 తగ్గడంతో రైతులు మార్కెట్లో ఆందోళన చేశారు. అధికారులు, కమీషన్ దారులను నిలదీశారు. విదేశాల నుంచి ఆర్డర్లు లేకపోవడం, ప్రధానంగా మిర్చీని ఎగుమతి చేసే చైనా, థాయ్ లాండ్, సింగపూర్దేశాల నుంచి ఇండెంట్ లేకపోవడంతోనే రేట్లు తగ్గాయని అధికారులు, ట్రేడర్లు సర్ది చెప్పారు. రైతులు మాత్రం ఇదంతా వ్యాపారులు ఆడుతున్న డ్రామా అంటూ వాపోతున్నారు.
జెండా పాట కంటే ముందుగా..
ప్రతిరోజూ ఉదయం 7.30కి వ్యాపారులంతా జెండా పాట పెట్టి మంచి క్వాలిటీ ఉన్న మిర్చీకి రేటు నిర్ణయిస్తారు. అయితే ఈ ధర రోజులో ఒకరిద్దరికి మాత్రమే దక్కుతోంది. మిగిలిన రైతుల నుంచి 4– 5 వేలు తక్కువకు కొంటున్నారు. జెండా పాట కంటే ఇంత తేడానా అంటూ రైతులు నిలదీస్తుండటంతో కొందరు వ్యాపారులు రూటు మార్చారు. కమీషన్ ఏజెంట్లతో కలిసి జెండా పాట కంటే ముందే రైతు దగ్గరకు పోయి తక్కువ రేటుకు కొనేస్తున్నారు. జెండా పాట అయిపోయాక నీ పంటకు ఇంకా తక్కువ రేటు పడుతుందని భయపెట్టి కొనేస్తున్నారు.
12 వేలకు అమ్మా
క్వింటా రూ.12 వేల చొప్పున మిర్చి అమ్మాను. జెండా పాట రూ.14 వేలు పడింది. అంతకంటే ముందే కమీషన్ఏజెంట్కొంతమంది వ్యాపారులను తీసుకొచ్చాడు. తేమ ఉందని, క్వాలిటీ లేదని తక్కువకు కొన్నారు. – భాస్కర్, రైతు, జయరాం చిన్నతండా, మహబూబాబాద్ జిల్లా
పాట తర్వాతే రైతులు అమ్మాలె
రైతులకు ట్రేడర్ల నుంచి గిట్టుబాటు ధర ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. జెండా పాట సమయంలో ట్రేడర్లందరూ ఉండాలి. రేటు విషయంలో పోటీ ఉంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది. అలా ఉండని వారి లైసెన్స్రద్దు చేసేందుకు కూడా వెనుకాడం. పాట అయిపోయాకే రైతులు పంట అమ్మాలి.
– మద్దినేని వెంకటరమణ,
మార్కెట్ కమిటీ చైర్మన్, ఖమ్మం