గద్వాల, వెలుగు: మున్సిపల్ షాపుల వేలంపాట జరగకుండా వ్యాపారులు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పదేళ్ల కిందనే గడువు ముగిసినా.. రాజకీయ నేతల సపోర్ట్‌తో వాయిదా వేయిస్తూ వస్తున్నారు. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఈ నెల 24న వేలంపాట నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో మరోసారి పోస్ట్‌పోన్ చేసేందుకు హైకోర్టులో ఫిటిషన్ వేశారు. ఇందుకోసం ప్రతి షాప్ నుంచి 50 వేల చొప్పున రూ.30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, కోర్టు విచారణను 25కు వాయిదా వేయడంతో టెండర్ రద్దు చేయాలని రాజకీయ నేతలు, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు.
40 ఏళ్లుగా తిష్ట
గద్వాల మున్సిపల్ షాపులను వ్యాపారులు 30 ఏళ్ల అగ్రిమెంట్‌తో కిరాయికి తీసుకున్నారు. కానీ, కౌన్సిల్ అండదండలు, రాజకీయ నాయకుల సపోర్ట్‌తో 40 ఏళ్లకు పైగా అదే షాప్ లో తిష్ట వేసుకుని కూర్చున్నారు. 10 ఏళ్ల కిందనే వేలంపాట నిర్వహించాల్సి ఉన్నా అధికారులు స్పందిచకపోవడంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇటీవల హైకోర్టుకు వెళ్లారు. కోర్డు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఐడీఎస్‌ఎమ్‌టీ(ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ స్మాల్ అండ్ మీడియం టౌన్)లోని 73 షాపుల వేలానికి గత నెల 30న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 21 వరకు అప్లికేషన్లు తీసుకొని, 24న వేలంపాట నిర్వహించేలా షెడ్యూలు ఖరారు చేశారు. ఇప్పటి వరకు 372 అప్లికేషన్లు వచ్చాయి.
ఇప్పటికే మూడు సార్లు వాయిదా..
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మున్సిపల్ షాపుల వేలం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. నాలుగేళ్ల కింద షాపులు వేలం వేయాలని మున్సిపల్ కౌన్సిల్ మూడుసార్లు తీర్మానం చేసి.. ప్రాసెస్ మొదలు పెట్టారు. కానీ, షాపుల యజమానులు కోర్టుకు వెళ్లి ఏడాది పాటు స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్నారు. రెండేళ్ల కింద 72 షాపుల వేలానికి అంతా రెడీ చేసినా.. నోటిఫికేషన్ జారీ అయ్యే సమయంలో రాజకీయ ఒత్తిళ్లతో రద్దు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. నిరుడు చైర్మన్ బీఎస్ కేశవ్ ఆధ్వర్యంలో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ వేసి యాక్షన్ రోజు సడన్‌గా రద్దు చేశారు. మరి ఈ సారైనా ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో.. లేదోనని పట్టణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ కిరాయికి సబ్ లీజ్‌కు ఇచ్చిన్రు..
40 ఏళ్ల కింద షాపులను లీజ్ తీసుకున్న వారు ప్రస్తుతం రూ. 3 వేల నుంచి రూ. 7 వేల లోపు మాత్రమే కిరాయిలు కడుతున్నారు. ఇందులో కొందరు సబ్ లీజ్‌కు ఇచ్చి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు రెంట్ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఓ వ్యాపారి అయితే పాత బస్టాండ్‌లో ఉన్న సెల్లార్‌కు రూ. 5 వేలు మాత్రమే కడుతూ.. ప్రస్తుతం రూ.60 వేలకు కిరాయి ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్వహిస్తున్న టెండర్లలో అధికారులు రూ.16 వేల నుంచి కిరాయి ఫిక్స్ చేశారు. అందుకే టెండర్లు వాయిదా వేసేలా వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
షెడ్యూల్ ప్రకారమే వేలంపాట
మున్సిపాలిటీలోని 73 షాపులకు షెడ్యూలు ప్రకారమే వేలంపాట నిర్వహిస్తం. ఇప్పటివరకు కోర్టు నుంచి మాకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. రూమర్స్‌ను ఎవరూ నమ్మవద్దు. కొత్త రూల్స్ ప్రకారమే రెంట్ డిసైడ్ చేసినం. ఎక్కువ కోట్ చేసిన వారికే షాపులు కేటాయిస్తం.
- నర్సింలు,
మున్సిపల్ కమిషనర్, గద్వాల