
- జిల్లాలో నాఫెడ్, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
- రైతుల పట్టా పాస్ బుక్స్ తో వ్యాపారుల దందా
నాగర్ కర్నూల్, వెలుగు: రైతుల పండించిన వేరుశనగకు మద్దతు ధర కల్పించేందుకు నాగర్ కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా సాగుతోంది. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి స్టాక్ చేసుకున్న వ్యాపారులు రైతుల పేరిట దర్జాగా పంటను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వేరుశనగ రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం నాఫెడ్ ద్వారా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించింది. పీఏసీఎస్‌ల ద్వారా జిల్లాలోని కల్వకుర్తి, కొండనాగుల, ఉప్పునుంతలలో మార్చి మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. క్వింటాల్‌కు రూ.6,783 కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో రైతుల కంటే ఎక్కువగా వ్యాపారులు వేరుశనగ అమ్ముకొని లాభపడుతున్నారు.
దళారుల దందా..
డిసెంబర్ నుంచి మార్చి వరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన వేరుశనగ పంటను రైతుల పేరు మీద అమ్ముకునేందుకు దళారులు పక్కా ప్లాన్ చేశారు. డిసెంబర్లోఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన ఉండగా, మూడు నెలలు ఆలస్యంగా మార్చి మొదటి వారంలో ప్రారంభించారు. అప్పటికే దాదాపు 90 శాతం మంది రైతులు వేరుశనగను మార్కెట్లో అమ్ముకోగా, ఆలస్యంగా సాగు చేసిన రైతులు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు పంటను తెచ్చారు. వీరికి తేమ శాతం, గింజ బరువు తదితర కారణాలతో రూ.5,500 మించి చెల్లించడం లేదు. క్వాలిటీ బాగా లేదని రైతులకు ధర తగ్గిస్తున్న కొనుగోలు కేంద్రం నిర్వహకులు, దళారులు తెస్తున్న వేరుశనగకు మాత్రం ఫుల్ రేట్ చెల్లిస్తున్నారు.
గురువారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రానికి 6 డీసీఎంలు,24 ట్రాక్టర్ల వేరుశనగ వచ్చినా ఒక్కరిద్దరు రైతులు మాత్రమే కనిపించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల్లో వేరుశనగను అమ్ముకునేందుకు తమకు తెలిసిన రైతుల పాస్‌బుక్‌లను తీసుకెళ్తున్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాక వాటిని తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రం సిబ్బందితో దళారులు ముందుగానే మాట్లాడుకోవడంతో వారు తెచ్చిన వేరుశనగకు ఎలాంటి కొర్రీలు పెట్టని మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ సిబ్బంది రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. కొంత మంది రైతులు కల్వకుర్తి మార్కెట్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయగా, మార్కెట్ కమిటీ సభ్యులు సీరియస్ అయ్యారు. నెల రోజులుగా సెంటర్లో పని చేస్తున్న వారిని తప్పించి కొత్త వారిని నియమించారు.
అప్పుడు ధర కోసం ఆందోళనలు..
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గతంలో కల్వకుర్తి, అచ్చంపేటలో వేరుశనగ రైతులు వ్యవసాయ మార్కెట్లలో ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు చేపట్టారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధర చెల్లించి దగా చేశారు. ప్రస్తుతం రైతుల పేరుతో వారే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకొని లాభపడుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. 3 నెలలు ఆలస్యంగా వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో తాము నష్టపోయామని వాపోతున్నారు.
ప్రారంభం నుంచే దందా..
ఉప్పునుంతల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మొదటి రోజు నుంచే కమీషన్ ఏజెంట్లు, దళారులు డీసీఎంల నిండా వేరుశనగ తెచ్చారు. విత్తనాలు, ఎరువుల కోసం అప్పు తీసుకున్న రైతులను ముందు ఉంచి వారి పేర్లపైనే అమ్ముకున్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. కొనుగోలు కేంద్రాలు దళారుల దందాకు సెంటర్లుగా మారాయి.
దుడ్డు ఎల్లయ్య, రైతు