చేతితోనే తేమ చెకింగ్ .. ఖమ్మం మార్కెట్​లో ట్రేడర్ల మాయాజాలం

  • క్వింటాల్​కు రూ.6 వేల నుంచి 6,800 ఇస్తున్న వ్యాపారులు
  • నిండా మునుగుతున్న పత్తి రైతులు  
  • ఉద్యోగాలు ఊడుతాయని కలెక్టర్  హెచ్చరించినా మారని ఆఫీసర్ల తీరు

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో పత్తి రైతుల పరిస్థితి ఏమీ మారలేదు. ట్రేడర్లు చేత్తో పత్తి బస్తాల్లో తేమ శాతాన్ని చూసి, మద్దతు ధర కంటే తక్కువకే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతాన్ని తెలుసుకునేందుకు 16 మెషిన్లు ఉన్నా, వ్యాపారులు మాత్రం చేత్తోనే తేమ శాతాన్ని చూసి రేటు డిసైడ్​ చేస్తున్నారు. గురువారం మార్కెట్​కు 18,500 బస్తాల పత్తి రాగా, జెండా పాటను రూ.6,800గా వ్యాపారులు నిర్ణయించారు.

ఎక్కువ మంది రైతుల నుంచి రూ.6 వేలకే క్వింటాల్​ చొప్పున కొనుగోలు చేశారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 శాతం తేమ ఉంటే క్వింటాకు రూ.7,521, 10 శాతం తేమ ఉంటే రూ.7,370, 12 శాతం ఉంటే రూ.7,220 రేటు ఇవ్వాలని ఫిక్స్​ చేశారు. గురువారం మార్కెట్ కు తెచ్చిన పత్తిని మెషిన్లతో పరిశీలిస్తే 8 నుంచి 14 శాతం తేమ ఉన్నట్టు అధికారులు ఎంట్రీ చేశారు. కానీ, రైతులకు మాత్రం మద్దతు ధర కంటే క్వింటాకు రూ.500 నుంచి రూ.వెయ్యి తక్కువగా చెల్లించారు. నిబంధనల ప్రకారమే మార్కెట్​లో కొనుగోళ్లు జరగాలని, లేకుంటే ఉద్యోగాలు ఊడతాయంటూ మూడ్రోజుల కింద ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్ ఖాన్​ వార్నింగ్  ఇచ్చినా ఫలితం లేదు.

మార్కెట్​లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్, పత్తి రైతులకు మద్దతు ధర దక్కకపోవడం చూసి మార్కెటింగ్  శాఖ జిల్లా అధికారి అలీం, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్​పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఎప్పటి మాదిరిగానే మార్కెట్​లో అధికారుల అజమాయిషీ, పర్యవేక్షణ లేకపోవడంతో ట్రేడర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

రేటు పెంచలేం, గిట్టుబాటు కాదు!

వ్యవసాయ మార్కెట్ ను కలెక్టర్​ ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో 9 శాతం తేమ ఉన్న పత్తికి కూడా రూ.6,900 రేటు చెల్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్రేడర్ కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు మద్దతు ధర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే లైసెన్స్​లు క్యాన్సిల్  చేస్తామని హెచ్చరించారు. అయినా వ్యాపారుల్లో మార్పు రాలేదు. మార్కెటింగ్ శాఖ అధికారుల లెక్క ప్రకారం ఖమ్మంలో 28 మంది పత్తి ట్రేడర్లు ఉన్నారు. 

ఆఫీసర్లు చెప్పినట్టుగా రేటు పెంచి పత్తిని కొనుగోలు చేయడం తమ వల్ల కాదని ట్రేడర్లు చెబుతున్నట్టు సమాచారం. రైతుల నుంచి ఎక్కువ రేటుకు కొంటే, తమకు గిట్టుబాటు కాదని అంటున్నారు. అయితే రూల్స్ కు విరుద్ధంగా మార్కెట్​లో వ్యవహారాలు నడిపిస్తున్న ట్రేడర్లపై సీరియస్​ యాక్షన్​ తీసుకుంటే తప్పించి దారికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మామూళ్ల మత్తులో అధికారులు కూడా వ్యాపారులతో మిలాఖత్  కావడంతో మార్కెట్​లో అక్రమాలు జరుగుతున్నాయి.

రైతుల కంటే రోజువారీగా వ్యాపారంలో వాటాలు పంపిస్తున్న ఖరీదుదారులపైనే ఆఫీసర్లు ప్రేమ చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీనిపై కలెక్టర్​ సీరియస్​గా దృష్టి పెడితేనే రైతులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలి

40 బస్తాలు పత్తి తీసుకువచ్చాను. తేమ శాతం ఎక్కువగా ఉందని రూ.6,300గా రేటు నిర్ణయించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే రైతులకు మద్దతు ధర దక్కుతుంది. వ్యాపారులకు పోటీ లేకపోవడం వల్ల తక్కువ రేటుకు కొని, రైతులకు అన్యాయం చేస్తున్నారు.
–కాశ్య, మన్నెగూడెం, మహబూబాబాద్ జిల్లా

చేత్తోనే తేమ శాతం చూసి  రేటు పెట్టిన్రు..

25 బస్తాల పత్తి మార్కెట్ కు తెచ్చాను. మెషిన్ తో తేమ శాతం చూడకుండా, చేత్తో చూసి ఖరీదుదారులు క్వింటా ధర రూ.6,200 గా నిర్ణయించారు. మా ప్రమేయం ఏమీ లేకుండానే కమీషన్  వ్యాపారి, ఖరీదుదారుడు పంటకు ధర నిర్ణయిస్తున్నారు. 
– లచ్య, బాసిత్ నగర్, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా