ఎర్రజొన్నపై సిండికేట్ ​పిడుగు

నిజామాబాద్,  వెలుగు:  ఆరుగాలం శ్రమించే రైతుకు అడుగడుగునా కష్టాలే. పండించిన పంటకు సర్కారు సహకారం లేక వ్యాపారులు సిండికేట్​గా మారి ఎర్రజొన్న రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నిజామాబాద్ ​జిల్లాలో గతేడాది 60 వేల ఎకరాల్లో పంట సాగయ్యింది. ఈసారి 40 వేల ఎకరాల్లో పంటను వేశారు. గతేడాదితో పోల్చితే సాగు తగ్గడంతో నార్త్ లో ఎర్రజొన్న సీడ్ కు డిమాండ్​పెరిగింది. అయితే ఎర్రజొన్న పంటకు ధరను వ్యాపారుల సిండికేట్ కంట్రోల్​చేస్తోంది. దీంతో రైతులు నిలువునా మునుగుతున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రజొన్న క్వింటాలుకు రూ.5 వేలు ఇవ్వాలని, మార్కెట్ లో వ్యాపారుల సిండికేట్ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

ఈసారి ఆశించిన దిగుబడి..​ 

ఎర్రజొన్న గతేడాది కంటే ఈసారి 20 వేల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ పంట సాగుకు ఎకరానికి రూ. 25 వేల ఖర్చవుతుంది. ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అకాల వానలతో సాగు తగ్గినా పంటపై జాగ్రత్తలు పాటించడంతో ఈసారి ఆశించిన దిగుబడి వచ్చింది. కూలీల రేట్లు, డీజిల్ ధరలు పెరగడంతో సాగు భారం రెట్టింపవుతోంది. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.3400 పలుకుతోంది. 

నార్తిండియాకే ఎగుమతి...  

ఆర్మూర్ డివిజన్ లో ఉత్పత్తయ్యే ఎర్రజొన్న పంటకు నార్త్ ఇండియాలో డిమాండ్ ఉంది. జిల్లాలో 70 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు సరుకు ఎగుమతి అవుతుంది. పశువుల దాణాగా వాడుతారు. ఆర్మూర్ ఎర్రజొన్నకు నాణ్యతతోపాటు డిమాండ్ కూడా ఉంది. అయినా ధరను మాత్రం వ్యాపారులే నిర్ణయించి లాభాన్ని వారే పొందుతున్నారు. దీంతో రైతులకు ఆశించిన రేట్ రావడంలేదు. ఆర్మూర్ ప్రాంతంలోనే కొనుగోళ్లు జరిపి నార్త్ ఇండియాకు తరలిస్తారు. క్వింటాలుకు కనీసం రూ.4500ల ధర వస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు.       

ఎర్రజొన్న కొనుగోళ్ల వివాదం.. 

ఎర్రజొన్న పంట కొనుగోలు విషయంలో ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. పంటను సర్కార్​ కొనుగోలు చేయక రైతులకు నష్టం వాటిల్లుతోంది. 2010‌‌-12లో కాంగ్రెస్ సర్కార్ ఎర్రజొన్న పంట కొనుగోళ్లు చేసినా బకాయిల చెల్లింపులు వివాదాస్పదంగా మారాయి. నార్త్ నుంచి వస్తున్న వ్యాపారులు ముందస్తుగానే రైతులతో ఒప్పందం చేసుకుని పంటను కొనుగోలు చేస్తారు. రైతులు తప్పనిసరిగా విక్రయిస్తుండడంతో లాభాలను అందుకోలేపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తే గిట్టుబాటు ధర వస్తుందని వారు ఆశిస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మోర్తాడ్ సభలో సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోళ్లకు ముందుకు రాలేదు. నాలుగేళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలింది.

ఎర్రజొన్నకు  గిట్టుబాటు ధర ఉండాలి..

ఎర్రజొన్నకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. గతేడాది ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో క్వింటాలుకు రూ. 4 వేల ధర వస్తోంది. మన ఎర్రజొన్న నాణ్యత ఉంటుంది. దీనికి రూ.4.5 వేల ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుత ధరతో రైతుకు నష్టమే.
  -
గొర్త రాజేందర్,​ రైతు, అర్గుల్

ధరను  స్థిరీకరించాలి..

డిమాండ్​ఉన్న ఎర్రజొన్నకు సీజన్​అంతా ఒకే ధరను సర్కార్​ నిర్ణయించాలి. సిండికేట్​కంట్రోల్ తో ధర మారుతోంది. దీంతో రైతుకు నష్టం తప్పడంలేదు. రూ.3200 నుంచి రూ.3700 ల మధ్య రేట్​మారుతోంది. దిగుబడి వచ్చిన తొలి రోజుల్లో ఒక ధర చివరి రోజుల్లో మరో ధర ఉంటుంది. దళారులే బాగుపడుతున్నరు. సీజన్ మొత్తానికి ఒకే ధర పలికేలా చర్యలు తీసుకోవాలి.   

- బెల్దార్ ప్రవీణ్, రైతు, ఆర్మూర్​డివిజన్