అచ్చంపేట, వెలుగు : నాగర్‌కర్నూల్‌జిల్లా అచ్చంపేటలో పల్లీ రైతుల ఆందోళనతో వ్యాపారులు దిగొచ్చారు. వేరుశనగ మద్దతు ధరను పెంచారు. వ్యాపారులు, మార్కెట్సిబ్బంది కుమ్మక్కై వేరుశనగ ధరను ఇష్టానుసారంగా తగ్గిస్తున్నారంటూ రైతులు ఆదివారం అచ్చంపేట అంబేద్కర్‌చౌరస్తాలో ధర్నాకు దిగడంతోపాటు మార్కెట్ఆఫీసును ముట్టడించారు. చైర్పర్సన్అరుణపై పల్లీలు పోసి నిరసన తెలిపారు. సోమవారం కూడా నిరసనను కొనసాగించారు. ర్యాలీగా అంబేద్కర్‌చౌరస్తా చేరుకుని, రాస్తారోకో చేపట్టారు. అనంతరం మార్కెట్ఆఫీసు ముందు బైఠాయించి, మద్దతు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. స్పందించిన మార్కెటింగ్‌శాఖ జేడీ ఇఫ్తకార్అహ్మద్, ఏడీ బాలమణి, అచ్చంపేట డీఎస్పీ కృష్ణకిశోర్.. రైతులు, వ్యాపారులతో పలు దఫాలు చర్చలు జరిపారు. చివరికి ఇరువురిని ఒప్పించి మద్దతు ధరను పెంచారు.
ఆదివారం రూ.4 వేలు నుంచి రూ.4,999 మధ్య పలికిన క్వింటాల్పల్లీకి రూ.200; రూ.5వేల నుంచి రూ.6,500 మధ్య ధర పలికిన పల్లీకి రూ.150; రూ.6,500 నుంచి రూ.7వేలు మధ్య ధర పలికిన పల్లీకి రూ.100 అదనంగా చెల్లించేందుకు వ్యాపారులు ఒప్పుకున్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించకపోతే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. చర్చల్లో మార్కెట్సెక్రటరీలు నర్సింహ, సరోజ, సీఐ రవీందర్, ఎస్సైలు రాము, లెనిన్, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.