వనపర్తి, వెలుగు: నిరుడు ఇదే సీజనులో క్వింటాలు వేరుశనగ రూ.8466 పలికింది. ప్రస్తుత ధర మాత్రం రూ.7559గా ఉంది. వేరుశనగకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ వనపర్తిలో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొంచెం అటుఇటుగా ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రధాన మార్కెట్లతో పాటు సూర్యాపేట, తదితర మార్కెట్లలో కంటే వనపర్తిలో ధర ఎక్కువ ఉండడం రైతులకు ఊరటనిస్తోంది. ఈ నెలలో వనపర్తిలో రూ.7,559, గద్వాలలో రూ.7,095, బాదేపల్లిలో రూ.6,595, సూర్యాపేటలో రూ.5,829 గరిష్ట ధర పలికింది.
తెగుళ్లను తట్టుకుని..
వానాకాలంలో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు జిల్లాలో వేరుశనగ పంట దెబ్బతింది. తెగుళ్లు సోకి దిగుబడి తగ్గిపోయింది. దీంతో ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున రావాల్సిన దిగుబడి 8 క్వింటాళ్లకు మించి రాలేదు. ఎకరానికి రూ.40 వేలు ఖర్చు పెడితే రైతులకు రూ.18 వేల నుంచి రూ.20 వేలు మాత్రమే మిగులుతున్నాయి. బహిరంగ మార్కెట్లో వేరశనగకు డిమాండ్ ఉన్నప్పటికీ ధర మాత్రం పెరగడం లేదని రైతులు వాపోతున్నారు. నిరుడు ఇదే సమయంలో వ్యాపారులు ఎక్కువ ధరతో కొనుగోలు చేశారు.
Also Read :- ఆరామ్ సే పోవచ్చు..రావచ్చు
ప్రస్తుతం వనపర్తిలో పల్లీలకు క్వింటాలుకు రూ.7519 గరిష్ట ధర చెల్లిస్తుండగా, కనిష్ట ధర రూ.5601 పలుకుతోంది. ప్రభుత్వం వేరుశనగకు రూ.6783 కనీస మద్దతు ధర ప్రకటించింది. వనపర్తి జిల్లాలో ఈ ఏడాది పల్లి సాగు బాగా తగ్గింది. గతంలో 25వేల ఎకరాల్లో పల్లి సాగయ్యేది. ఈసారి 7,471 ఎకరాలకే పరిమితమైంది. విత్తనాలు క్వింటాలుకు రూ.13 వేలు ఉండగా, దుక్కి దున్నడం, క్లీన్చేయడం, పిండి సంచులు, కలుపు తీతతో కలుపుకొని ఎకరానికి రూ.40 వేల వరకు ఖర్చవుతోంది.
కొనుగోలు కేంద్రం లేదు..
జిల్లాలో ప్రభుత్వం తరపున వేరుశనగ కొనుగోలు కేంద్రాలు లేవు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో, సరుకు నాణ్యతను పరిశీలించేందుకు ఎలాంటి యంత్రాలు లేవు. వ్యాపారులు వేరుశనగను చేతులతో పరిశీలించి నాణ్యతను నిర్ధారించి ధర నిర్ణయిస్తున్నారు.
వనపర్తి పల్లీలకు ఫుల్ డిమాండ్..
అఫ్లాటాక్సిన్ అనే శిలీంద్రం లేని పల్లీలు వనపర్తి జిల్లా నేలల్లో పండుతుండడంతో ఇక్కడి పల్లీలకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి పల్లీలను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, వరంగల్, వనపర్తి మార్కెట్లకు వేరుశనగ పంట వస్తోంది. వీటిలో వనపర్తి, గద్వాల మార్కెట్లకే కాస్త ఎక్కువగా సరుకు వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం వనపర్తిలో క్వింటాలు పల్లీ ధర గరిష్టంగా రూ.7,519 ఉండగా, కనిష్ట ధర రూ.5,201 పలికింది.
కొనుగోలు కేంద్రాలు పెట్టాలి
ప్రభుత్వం వేరుశనగ కొనుగోలు కేంద్రాలను తెరిస్తే ధరలో తేడా ఉండదు. రైతులకు న్యాయం జరుగుతుంది. ధర పూర్తిగా వ్యాపారుల చేతుల్లో ఉండడంతో వారు ఇష్టం వచ్చిన రేటు పెడుతున్నారు. నిరుడు కొంత ఆదాయం వచ్చింది. ఈ సారి పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలతో రైతులకు ధర వస్తుంది.
బింగి రాములు, రేవల్లి