రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.2203 ఉంటే ప్రైవేట్​వ్యాపారులు రూ.1800 నుంచి 1900లకే ధాన్యం కొంటున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గురువారం మోత్కూరులో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేట్ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న మోసాలను రైతులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు.  రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని క్వింటాల్​కు రెండు కిలోలు కటింగ్, రెండు శాతం కమిషన్ కట్ చేసుకుని డబ్బులు చెల్లిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రైవేట్ వే బ్రిడ్జి కాంటాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారని, వాటికి పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. వేబ్రిడ్జి కాంటాల తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయన్నారు. తనకున్న భూమితోపాటు కౌలుకు తీసుకుని 25 ఎకరాల్లో వరి పండిస్తున్నానని, గత వానకాలంలో తన వడ్లు అమ్మితేనే వేబ్రిడ్జి తూకంలో 4 క్వింటాళ్ల తేడా వచ్చిందని తెలిపారు.

మోత్కూరు, అడ్డగూడూరు మండలాలతోపాటు నియోజకవర్గంలో వందకు పైగా సెంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. మార్కెటింగ్, తూనికలు, కొలతల ఆఫీసర్లు వే బ్రిడ్జి కాంటాలను తనిఖీలు చేయాలని, తక్కువ ధరకు వడ్లు కొంటూ రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేట్ ధాన్యం కేంద్రాలను వెంటనే మూసివేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్​ లీడర్లు డాక్టర్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, మున్సిపల్ కో–ఆప్షన్ మెంబర్ పోలినేని ఆనందమ్మ,  మలిపెద్ది మల్లారెడ్డి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, పోలినేని స్వామిరాయుడు, మందుల సురేశ్, పల్లపు నమ్మయ్య, చేతరాశి వీరస్వామి, మలిపెద్ది శ్రీకాంత్ రెడ్డి, మెంట నగేశ్​ఉన్నారు.